Lucknow Prisoners Tested HIV Positive: ఉత్తరప్రదేశ్ లోని లక్నో (Lucknow) జైలులో హెచ్ఐవీ (HIV) కలకలం రేగింది. జిల్లా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించగా 36 మందికి ఈ వైరస్ సోకినట్లు తేలిందని అధికారులు తెలిపారు. తాజాగా, ఆ సంఖ్య మరింత పెరిగినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో జైలు సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాధితులందరికీ లక్నోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అయితే, వైరస్ వ్యాప్తికి గల కారణాలపై స్పష్టత లేదు. ఈ ఖైదీల్లో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, వాటిని శరీరంలోకి ఎక్కించుకునే క్రమంలో ఒకరు వాడిన సిరంజీని మరొకరు ఉపయోగించడం వల్లే వైరస్ వ్యాపించిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వీరందరికీ ముందే హెచ్ఐవీ ఉందని.. జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ సంక్రమించలేదని చెబుతున్నారు. కాగా, గత ఐదేళ్లలో ఈ జైలులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే తొలిసారి. దీనికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా భారీగా కేసులు బయటపడగా మిగిలిన ఖైదీలు తమ ఆరోగ్యం, భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అయితే, కేసుల సంఖ్య పెరగకుండా వైద్య ఆరోగ్య శాఖ సూచన మేరకు నియంత్రణ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.


Also Read: Election Commission : ఆ పని చేస్తే రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు - ఎన్నికల సంఘం తాజా ఆదేశాలు !