Champai Government Won Floor Test: ఝార్ఖండ్ లో రాజకీయా సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. ప్రభుత్వానికి మద్దతుగా 47 మంది ఓటేయగా.. వ్యతిరేకంగా 29 మంది ఓటేశారు. దీంతో విశ్వాస పరీక్షను ప్రభుత్వం నెగ్గింది. అంతకు ముందు శాసనసభలో చంపై సోరెన్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. స్పీకర్ ఓటింగ్ చేపట్టారు. 47 మంది ఎమ్మెల్యేలు చంపై సోరెన్ సర్కారుకు అనుకూలంగా ఓట్లేయగా.. విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. అనంతరం సోరెన్ కు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం - JMM)కు 28,  కాంగ్రెస్ (16), ఆర్జేడీ (1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సీపీఐ (ఎంఎల్) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తున్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్షలో నెగ్గాలంటే 41 ఓట్లు వస్తే సరిపోతుంది.






'ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర'


కాగా, అసెంబ్లీలో బల పరీక్షకు ముందు సీఎం చంపై సోరెన్ ప్రసంగించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని చంపై ఆరోపించారు. మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తోందని మండిపడ్డారు.


హేమంత్ సోరెన్ తీవ్ర ఆరోపణలు






అటు, విశ్వాస పరీక్షకు ముందు అసెంబ్లీలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడారు. ఈడీ తనను అరెస్ట్ చేయడంలో రాజ్ భవన్ ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. తన అరెస్ట్ భారత ప్రజాస్వామ్యంలో నల్ల అధ్యాయం అని అన్నారు. భూ కుంభకోణంలో తనకు సంబంధం ఉందని నిరూపించాలని ఈడీకి సవాల్ విసిరారు. చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎలాగో వారి నుంచి నేర్చుకోవాలంటూ.. బీజేపీని ఉద్దేశించి మాట్లాడారు. నేరం రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని అన్నారు. 'మేం ఓటమిని అంగీకరించలేదు. నన్ను కటకటాల వెనక్కు నెట్టి విజయం సాధించగలమని భావిస్తే ఝార్ఖండ్ లో ప్రతి మూలలో గిరిజనులు, దళితులు తమ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు.' అని వ్యాఖ్యానించారు. కాగా, భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేయగా.. శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ ను ఎన్నుకున్నారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించండంతో సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించారు. కోర్టు అనుమతితో హేమంత్ సోరెన్ బల పరీక్షలో పాల్గొన్నారు.


Also Read: Byjus financial problems: ఆర్థిక క‌ష్టాల్లో బైజూస్‌.. జీతాలు ఇచ్చేందుకు తంటాలు ప‌డుతున్నామ‌న్న సీఈవో ర‌వీంద్ర‌న్‌