49వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో లిక్విడ్ బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లు, కొన్ని ట్రాకింగ్ పరికరాలపై వస్తు, సేవల పన్నును తగ్గించాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. జూన్‌లో జీఎస్‌టీ పరిహారం సెస్ రూ.16,982 కోట్ల పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిలను క్లియర్ చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశానికి సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. గుట్కా, పాన్ మసాలా పరిశ్రమలు పన్ను ఎగవేయడం, జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు కోసం రెండు వేర్వేరు మంత్రివర్గ ఉప సంఘాలు సమర్పించిన నివేదిలకలపై చర్చించి స్వల్ప మార్పులతో ఆమోదించారు. జీఎస్టీ మండలి సమావేశం ముగిసిన అనంతరం తీసుకున్న కొన్ని ప్రధాన నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. 






49వ GST కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాలివే.. 
- జూన్‌ నెలకు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన మొత్తం రూ.16,982 కోట్ల జీఎస్టీ పరిహారం మొత్తం విడుదల చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 


- కేంద్రం వద్ద పరిహారం కోసం ఈ మొత్తం అందుబాటులో లేనప్పటికీ, ఈ మొత్తాన్ని కేంద్రం వనరుల నుంచి విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. సెస్ సేకరణ నుంచి ఈ మొత్తాన్ని భవిష్యత్తులో భర్తీ చేస్తామన్నారు. 


- 2017 GST (రాష్ట్రాలకు పరిహారం) చట్టం ప్రకారం ఐదేళ్లపాటు చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని కేంద్రం చెల్లించినట్లు అవుతుందన్నారు. తాజాగా జీఎస్టీ పరిహార బకాయి విడుదలతో తెలంగాణకు రూ.548 కోట్లు, ఏపీకి రూ.689 కోట్లు రానున్నాయి. ఏజీ సర్టిఫికెట్ల ఆధారంగా ఆరు రాష్ట్రాలకు రూ.16,524 కోట్లు కూడా విడుదల చేశామని సీతారామన్ తెలిపారు.


- పెన్సిల్ షార్పనర్లపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.


-  ద్రవ బెల్లం (Liquid Jaggery) పై 18 శాతంగా ఉన్న జీఎస్‌టీని పూర్తిగా ఎత్తివేశారు. అయితే ప్యాకింగ్ చేసిన,  లేబుల్ వేసిన రకాల బెల్లంపై పన్ను రేటు 5 శాతం ఉండనుందని స్పష్టం చేశారు.


- ట్యాగ్స్ ట్రాకింగ్ పరికరాలు, డేటా పరికరాలపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని కొన్ని షరతులతో పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది జీఎస్టీ మండలి.


- రెండు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నివేదికలను ఒకటి స్వల్ప మార్పులతో, మరొకటి కొన్ని చిన్న సవరణలతో ఆమోదించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.


- పాన్ మసాలాలపై పన్ను విధింపుపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికకు ఆమోదం లభించింది. 


- భాష మార్పు కోసం జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్స్ ఏర్పాటుకు ఆమోదం. డ్రాఫ్ట్‌లో చేసిన సవరణలు వచ్చే 5-6 రోజుల్లో వెల్లడిస్తామన్నారు మంత్రి నిర్మలా. 


- తుది గడువు తర్వాత వార్షిక జీఎస్టీ రిటర్న్‌ల దాఖలుపై ఆలస్య రుసుములను హేతుబద్ధీకరించారు.