జమ్ముకశ్మీర్‌లో రెండు వేర్వేరు ఎన్ కౌంటర్ లు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. షోపియాన్, పుల్వామా జిల్లాల్లో ఎన్కౌంటర్లు జరిగాయి. పుల్వామా జిల్లాలో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. షోపియాన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్ ఏ తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతం హర్దుమీర్లో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించారు. భద్రతా బలగాలు.. తనిఖీలు చేస్తుండగా.. ముష్కరులు కాల్పులు జరిపారు. వెంటనే.. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేశాయి. నదీమ్ భట్, ఐఈడీ నిపుణుడు రసూల్ అదిల్ ఈ కాల్పుల్లో చనిపోయారు. ఘటన స్థలంలో రెండు ఏకే రైఫిళ్లు దొరికాయి. వీళ్లిద్దరూ అనేక తీవ్ర వాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని.. కశ్మీర్ ఐజీపీ తెలిపారు.
షోపియాన్‌లోని చౌగామ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు.. ఇద్దరు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను హతమార్చారు. మృతులు.. సాజద్ అహ్మద్ చాక్, రాజా బాసిత్ యాకూబ్‌గా గుర్తించారు. ఘటన స్థలంలో ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం అనంత్‌నాగ్‌లోని అరివానీ గ్రామంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని హతమార్చినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. సంఘటన స్థలం వద్ద నుంచి ఒక ఏకే 47 రైఫిల్ మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.