ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యుక్రెయిన్ లో ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఉక్రెయిన్ బలగాలు సైతం రష్యన్ సైన్యాన్ని తమ భూభాగం నుంచి తరిమికొట్టేందుకు సర్వశక్తులు ప్రదర్శిస్తోంది. భారత్ శాంతిమంత్రాన్ని పాటిస్తూనే.. హ్యూమనటేరియన్ గ్రౌండ్స్ లో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులతో పాటు సాధారణ పౌరులను వారి దేశాలకు తరలించేందుకు సాయం అందిస్తోంది. ఆపరేషన్ గంగా ద్వారా ఉక్రెయిన్ లో చిక్కుకున్న వేలాది విద్యార్థులను సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్.
టాక్ ఆఫ్ ది కంట్రీ
సరిగ్గా ఈ సందర్భంలోనే ఓ యువతి వార్తల్లో నిలిచింది. తన విధులను కచ్చితత్వంతో నిర్వర్తిస్తూనే ధైర్యసాహసాలను ప్రదర్శించి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఆమె పేరే మహాశ్వేత చక్రవర్తి.
టఫ్ టాస్క్ స్మూత్‌గా
24 ఏళ్ల మహాశ్వేత చక్రవర్తి...ఓ పైలెట్. కోల్ కతా కు చెందిన ఈమె నాలుగేళ్లుగా పైలెట్ గా ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉక్రెయిన్ వార్ లో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తరలించే బృందంలో పాల్గొనాలని మహాశ్వేత చక్రవర్తికి ఆదేశాలు అందాయి. ఉక్రెయిన్, పోలాండ్, హంగేరీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తరలించటం ఆమెకు అప్పగించిన టాస్క్. అలా ఫిబ్రవరి 27న తనకు అప్పగించిన బాధ్యతలను స్వీకరించిన మహాశ్వేత చక్రవర్తి...మార్చి 7 వరకూ అంటే పదిరోజుల్లో 6 విమానాలను నడిపారు. మూడు దేశాల నుంచి మొత్తం 800 మంది విద్యార్థులను ఈ యువ పైలట్ భారత్ కు సురక్షితంగా తరలించారు.
ఎయిర్‌బస్ నడపడం మర్చిపోలేని సంఘటన
స్పెషల్ మిలటరీ ఆపరేషన్ లో భాగంగా ఎయిర్‌బస్-ఏ320 (Airbus A320) లాంటి విమానాలను రోజుకు 13, 14 గంటల పాటు నడపటం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని మహాశ్వేత చక్రవర్తి తెలిపారు. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో భయపడకుండా విమానాలను నడిపి...భారతీయ విద్యార్థులను సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చిన యువ పైలట్ అంటూ ఆమె ధైర్య సాహసాలను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి.
కరోనా టైంలో ఆక్సిజన్
ఆమెను ఈ స్పెషల్ మిలటరీ ఆపరేషన్ కు తీసుకోవటానికి ప్రధాన కారణం.. ఇంతకు ముందు వందే భారత్ మిషన్ లోనూ మహాశ్వేత భాగస్వామి కావటం. కరోనా మహమ్మారి సమయంలో వ్యాక్సిన్లు లేక అల్లాడుతున్న ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పుణే నుంచి కోల్ కతా కు ఆమె విమానాలను నడిపారు. అంతే కాదు ఆక్సిజన్ కొరతను భారత్ ఎదుర్కొన్న వేళ...విదేశాల నుంచి ఆక్సిజన్ కాన్సట్రేటర్ లను భారత్ కు తీసుకువచ్చిన టీంలోనూ మహాశ్వేత చక్రవర్తి సభ్యురాలు. అప్పటి సేవలను గుర్తుపెట్టుకున్న భారతీయ వాయుసేన... ఉక్రెయిన్ యుద్ధ సమంయలోనూ ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు.
రాజకీయ నేపథ్యం
మహాశ్వేత వ్యక్తిగత జీవితానికి వస్తే కోల్ కతా కు చెందిన ఓ రాజకీయ కుటుంబంలో జన్మించారు ఆమె. 24 ఏళ్ల శ్వేత ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరన్ అకాడమీ నుంచి ఏవియేషన్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె తల్లి తనూజా చక్రవర్తి పశ్చిమబెంగాల్ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ గా ఉన్నారు. తన కుమార్తె ను పూర్తిగా రాజకీయ వ్యవహారాలకు దూరంగా పెంచామన్న తనూజా...భారతీయ వాయుసేన తో కలిసి తను సాధించిన విజయాలు గర్వకారణమని కొనియాడారు. కీలకమైన ఆపరేషన్ లో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న మహాశ్వేత చక్రవర్తిపై ప్రశంసల జల్లు కురస్తూనే ఉంది.