UPI Service in Maldives: భారత్, మాల్దీవ్స్ మధ్య కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. అయితే...ఈ వైరాన్ని పక్కన పెట్టి మళ్లీ మైత్రిని పెంచుకునేందుకు ఇరు వైపులా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో భేటీ అయ్యారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇకపై మాల్దీవ్స్‌లోనూ UPI చెల్లింపులు జరిపేలా ఓ అగ్రిమెంట్‌పై ఇద్దరూ సంతకం చేశారు. ఈ ఒప్పందంతో మాల్దీలవ్స్ టూరిజం సెక్టార్‌పై సానుకూల ప్రభావం పడుతుందని జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు MOUపై సంతకం చేసినట్టు వెల్లడించారు.
మాల్దీవ్స్‌లో మూడు రోజుల పాటు పర్యటించారు జైశంకర్. త్వరలోనే భారత్ మాల్దీవ్స్‌లో UPI సర్వీస్‌లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. X వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలోనే మాల్దీవ్స్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తుందని స్పష్టం చేశారు. Unified Payment Interface (UPI) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ తయారు చేసింది. మొబైల్ ఫోన్ ద్వారా ఓ బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కి చెల్లింపులు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
ఈ భేటీ సందర్భంగా మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు చాలా విజయవంతంగా జరిగాయని వెల్లడించారు. UPI కారణంగా భారత్‌లో డిజిటల్ చెల్లింపుల విప్లవం కొనసాగుతోందని ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపుల్లో 40% వాటా భారత్‌దే అని తేల్చి చెప్పారు.
"ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ చెల్లింపుల్లో 40% వాటా ఇండియాదే. ఈ స్థాయిలో డిజిటల్ విప్లవాన్ని చూస్తున్నాం. రోజు రోజుకీ ఈ చెల్లింపులు ఇంకా పెరుగుతున్నాయి. ఇవాళ మాల్దీవ్స్‌తో చేసుకున్న ఒప్పందం ఇందుకు కొనసాగింపుగా భావిస్తున్నాం. ఈ అగ్రిమెంట్ ద్వారా మాల్దీవ్స్‌లోనూ డిజిటల్ విప్లవం వస్తుందని బలంగా విశ్వసిస్తున్నాం"
- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించి అక్కడి పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేశారు. ఆ సమయంలో మాల్దీవ్స్ మంత్రులు నోరు పారేసుకున్నారు. భారత్‌పై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇండియన్స్ భగ్గుమన్నారు. బైకాట్ మాల్దీవ్స్ పేరిట ఓ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. అంతే కాదు. మాల్దీవ్స్‌కి ట్రిప్స్‌నీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఫలితంగా మాల్దీవ్స్‌కి ఆదాయం తగ్గిపోయింది. అప్పటి నుంచి మళ్లీ భారతీయులను బుజ్జగిస్తోంది. మళ్లీ టూరిజం సెక్టార్‌ని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
Also Read: Viral News: పరువు హత్య నేరం కాదు, అది కూడా ఓ రకం ప్రేమే - తమిళ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు