గురు శుక్రవారాలు తనపై దాడికి వచ్చినట్టే కుమార్తెలు, వాణి వచ్చారని ఆరోపించారు దువ్వాడ శ్రీనవాస్. తనను ఎప్పుడూ తనవైపు చూడని తనతో మాట్లాడని వాళ్లు కూడా అర్థరాత్రి వచ్చారని అన్నారు. తను ఎప్పుడైనా చంపేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే చాలా మంది వార్నింగ్ కూడా ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. 


తాను చాలా మందిపై విమర్శలు చేశానని వాళ్లంతా తనను టార్గెట్ చేసుకుంటారని కూడా తెలుసు అన్నారు శ్రీనివాస్. తన కుటుంబం, తాను విమర్శలు చేసిన వాళ్లు, తన రాజకీయ ప్రత్యర్థులు తనను చంపేందుకు సిద్ధమవుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో ఎవరైనా వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 


తనకు ప్రమాదం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చారు. తన స్వీయ రక్షణ కోసం తుపాకీ ఇవ్వాలని పోలీసులకు రిక్వస్ట్ పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని వివరించారు. ఈ పరిస్థితుల్లోనే గురువారం రాత్రి తన కుమార్తెలు తన ఇంటికి వచ్చారని తెలిపారు. ఓ తండ్రి వద్దకు కుమార్తెలు ఇలా హంగామా చేసి వస్తారా అని ప్రశ్నించారు. ఊరేగింపుగా ఏదో గొడవకు వెళ్తున్నట్టుగా టీడీపీ నేతలను వెంటబెట్టుకొని వచ్చారని ఆరోపించారు. వారి చేతుల్లో ఆయుధాలు, కారప్పొడి కూడా ఉన్నాయని తెలిపారు. తనపైదాడి జరుగుతుందని గ్రహించే బయటకు రాలేదని వివరించారు. 
కుమార్తెలు రావడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన దువ్వాడ వాణి శుక్రవారం వచ్చి మళ్లీ హడావుడి చేయడం ఏంటని ప్రశ్నించారు దువ్వాడ శ్రీనివాస్. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి తనకు ప్రాణ హాని తలపెట్టేందుకు యత్నించారని ఆరోపించారు. అప్పట్లో డంబెల్‌తో కొట్టి చంపేందుకు యత్నించిన వాణి ఇప్పుడు కూడా అదే పని చేయడానికి సిద్ధపడ్డారని తెలిపారు. 


తన ఆస్తులు, రాజకీయ భవిష్యత్ లాగేసుకున్న వాళ్లకు తనతో పనేంటి అని ప్రశ్నించారు. చాలా కాలంగా తనను వాళ్ల ఇంటికి రానివ్వడం లేదని ఎన్నికల టైంలో కూడా రానివ్వకపోవడంతో కారులోనే పడుకున్నానని చెప్పారు. తనతోపాటు తన కుటుంబాన్ని కూడా ఎప్పుడూ గౌరవించలేదని తన తల్లి వస్తే రోడ్డుపైనే మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఇలాంటివి బయటకు చెబితే పరువు పోతుందని అందుకే ఇన్నాళ్లూ గుట్టుగా ఉండిపోయానని ఇప్పుడు ఆమె ఇంత రచ్చ చేసిన తర్వాత కొన్ని బయట పెట్టక తప్పడం లేదన్నారు.