ప్రధాని మోదీ రాష్ట్రాల సంఖ్య పెంచే పనిలో ఉన్నారు: కర్ణాటక మంత్రి
2024 లోక్‌సభ ఎన్నికల తరవాత దేశంలో రాష్ట్రాల సంఖ్య 50కి పెరుగుతుందంటూ కర్ణాటక మంత్రి ఉమేష్ కట్టి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. "2024 ఎన్నికలు పూర్తయ్యాక ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల సంఖ్యను పెంచే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆ పనిలో ఉన్నట్టు తెలుస్తోంది" అని అన్నారు ఉమేష్. అంతే కాదు. కర్ణాటక రెండు రాష్ట్రాలుగా విడిపోతుందని, అందులో ఉత్తర కర్ణాటక కొత్త రాష్ట్రంగా అవతరిస్తుందని జోష్యం చెప్పారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌నూ నాలుగు రాష్ట్రాలుగా, మహారాష్ట్రను మూడు రాష్ట్రాలుగా విడగొట్టనున్నారనీ అన్నారు.
కర్ణాటకను రెండు ముక్కలు చేయనున్నారా..?
ఇలా రాష్ట్రాలను విడగొట్టి కొత్తవి ఏర్పాటు చేయటం మంచి ఆలోచన అని,ప్రజలపై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు ఉమేష్ కట్టి. ఉత్తర కర్ణాటకలోనూ అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి. రాష్ట్రం రెండుగా విడిపోయినా కన్నడిగులమంతా ఒకటేనని, ఎవరికి ఎలాంటి సమస్యా రాదని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల్ని కర్ణాటక సర్కార్ కొట్టి పారేసింది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తీవ్రంగా ఖండించారు. "ఉత్తర కర్ణాటక అనే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనే లేదు" అని తేల్చి చెప్పారు. ఉమేష్ కట్టి చాలా సంవత్సరాలుగా ఇదే మాటను చెబుతున్నారని, ఎందుకిలా మాట్లాడుతున్నారో ఆయనే సమాధానమివ్వాలని కాస్త ఘాటుగా స్పందించారు సీఎమ్. కర్ణాటర రెవెన్యూ మంత్రి ఆర్ అశోక కూడా ఉమేష్ వ్యాఖ్యల్ని ఖండించారు. ఆయన ఇలా మాట్లాడటం ఇదే తొలిసారి కాదని ఇప్పటికే వంద సార్లు ఇదే వ్యాఖ్యలు చేశారని అసహనం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, ఇందులో వాస్తవాలేంటే నిగ్గు తేల్చాలని అడిగారు. కర్ణాటకను రెండుగా చీల్చాలనే ఆలోచన చేసినా...మాతృభూమికి, మాతృభాషకి ద్రోహం చేసినట్టేనని ట్వీట్ చేశారు.