Arvind Kejriwal Arrest: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన అమెరికా దౌత్యవేత్తకి భారత్ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ ఈ నోటీసులు పంపింది. కేజ్రీవాల్ అరెస్ట్‌కి సంబంధించిన పరిణామాల్ని పరిశీలిస్తున్నామని గ్లోరియా బెర్బెనా (Gloria Berbena)
చేసిన వ్యాఖ్యలపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. భారత్‌లోని లీగల్ ప్రొసీడింగ్స్‌ గురించి ఇలా మాట్లాడడం సరికాదని మందలించింది. 


"పరస్పరం సహకరించుకోవడం, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం దౌత్యంలో చాలా కీలకమైన విషయం. అంతర్గత విషయాలనూ గౌరవించాలి. ప్రజాస్వామ్య దేశాల్లో ఇది మరింత ముఖ్యమైన అంశం. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సానుకూల వాతావరణం దెబ్బ తింటుంది. భారత్‌లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఆధారంగానే లీగల్ ప్రొసీడింగ్స్‌ జరుగుతాయి. సరైన సమయానికి అవి చర్యలు తీసుకుంటాయి. "


- భారత విదేశాంగమంత్రిత్వ శాఖ






ఈ క్రమంలోనే గ్లోరియాతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ 40 నిముషాల పాటు ప్రత్యేకంగా సమావేశమైంది. ఆమెకి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం కీలకంగా మారింది. మార్చి 26వ తేదీన గ్లోరియా కేజ్రీవాల్ అరెస్ట్‌పై (Kejriwal Arrest News Updates) మాట్లాడారు. చట్టపరమైన విచారణ పారదర్శకంగా, సరైన విధంగా జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే భారత్‌కి అసహనం కలిగించింది. ఇటీవలే జర్మనీ కూడా కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇదే విధంగా వ్యాఖ్యలు చేసింది. దీనిపైనా భారత్‌ అసహనం వ్యక్తం చేసింది. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని మందలించింది. తమది ప్రజాస్వామ్య దేశం అని, చట్టపరంగా ఏం జరగాలో అదే జరుగుతుందని స్పష్టం చేసింది. జర్మన్‌ తీరుని వ్యతిరేకిస్తూ ఓ ప్రకటన చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానేయాలని మందలించింది. 

"భారత్‌ అనేది ఓ ప్రజాస్వామ్య దేశం. మా దేశంలో పటిష్ఠమైన చట్టాలున్నాయి. ఈ తరహా అవినీతి కేసుల్లో చట్ట ప్రకారమే అన్నీ జరుగుతాయి. భారత్‌లోనే కాదు. ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా ఇదే జరుగుతుంది. పక్షపాతంగా వ్యవహరించి ఇలాంటి వ్యాఖ్యలు, అనవసరపు ఊహాగానాలు సరికాదు."


- భారత ప్రభుత్వం






Also Read: Miss Universe 2024: మిస్ యూనివర్స్ పోటీలోకి సౌదీ అరేబియా, చరిత్రలోనే ఇది తొలిసారి