కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో ఘనత సాధించింది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ 150 కోట్ల మార్క్ దాటింది. మంగళవారం నాటికి దేశంలో మొత్తం 153.70 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపణీ చేశామని కేంద్ర ఆర్యోగ శాఖ ప్రకటించింది. మంగళవారం ఒక్క రోజే రాత్రి 7 గంటల వరకు దేశంలో 76 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని వెల్లడించింది. దేశంలో కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్రం పేర్కొంది.
దేశంలో మంగళవారం 76,68,282 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం డోసుల పంపిణీ 1,53,70,44,657కు చేరింది. ప్రికాషనరీ డోసుల పంపిణీ కూడా వేగంగా జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు 18,52,611 ప్రికాషనరీ డోసులను నిర్దేశించిన వ్యక్తులకు పంపిణీ చేశామని పేర్కొంది. ఇందులో మంగళవారం 8,47,880 డోసుల పంపిణీ చేసినట్లు తెలిపింది.
Also Read: Omicron Symptoms: ఈ మూడు లక్షణాలు కనిపిస్తే అది ఒమిక్రాన్ కావచ్చు... తేలికగా తీసుకోవద్దు
ప్రికాషనరీ లేదా బూస్టర్ వ్యాక్సినేషన్ సోమవారం(జనవరి 10) నుంచి ప్రారంభమైంది. వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వయసున్న వారికి బూస్టర్ డోస్ వేస్తున్నారు. మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, రోజు వారి లెక్కలు రాత్రికి పూర్తవుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు ఈ వయసు వారికి మొత్తం 2,81,00,780 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని వెల్లడించింది. దేశంలో కోవిడ్ ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని కేంద్ర వెల్లడించింది. వ్యాక్సినేషన్ వల్ల కోవిడ్ వ్యాప్తిని తగ్గించగలిగామని తెలిపింది. దేశంలో కోవిడ్ వ్యాప్తిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొంది.
Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?