Boycott Maldives Trend: భారత్ మాల్దీవ్స్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తరవాత మాల్దీవ్స్ మంత్రులు కొందరు నోరు పారేసుకున్నారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి భారతీయులు మాల్దీవ్స్ ట్రిప్‌ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈ వివాదంపై మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాయ్‌కాట్ మాల్దీవ్స్ కారణంగా తమ దేశ పర్యాటక రంగం ఎంత నష్టపోయిందో వివరించారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మాల్దీవ్స్‌ ప్రజల తరపున భారత్‌కి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న నషీద్ ఇలా స్పందించారు. ఈ సమయంలోనే భారత్‌కి సారీ చెప్పారు. 


"బాయ్‌కాట్ మాల్దీవ్స్ కారణంగా మా పర్యాటక రంగంపై గట్టిగానే ప్రభావం పడింది. ఇలాంటి సమయంలో భారత్‌కి రావడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తోంది. ఏదేమైనా మాల్దీవ్స్ ప్రజల తరపున నేను క్షమాణపలు చెబుతున్నాను. ఇలా జరిగి ఉండకూడదు. భారతీయులంతా మాల్దీవ్స్‌కి రావాలని కోరుకుంటున్నాను. మా ఆతిథ్యంలో ఎలాంటి మార్పు ఉండదని హామీ ఇస్తున్నాను"


- మహమ్మద్ నషీద్, మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు 


భారత్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు నషీద్. మోదీతో తమతో చాలా బాగా మాట్లాడారని, మోదీకి తాను అతి పెద్ద సపోర్టర్‌ని అని వెల్లడించారు. ప్రధాని మోదీకి ఆల్‌ది బెస్ట్ చెప్పినట్టు తెలిపారు. బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌కి కారణమైన మంత్రులని ప్రస్తుత అధ్యక్షుడు వెంటనే తొలగించారని గుర్తు చేశారు. భారత్ మాల్దీవ్స్ మధ్య ఎన్నో ఏళ్లుగా మైత్రి కొనసాగుతోందని చెప్పారు. మాల్దీవ్స్ నుంచి భారత్ సైన్యం వెళ్లిపోవాలని చెబితే...భారత్ ఆ విషయంలో ఎలాంటి తగువు పెట్టుకోలేదని, చర్చించేందుకే ముందుకు వచ్చిందని ప్రశంసించారు. 


ఇటీవల జైశంకర్‌ భేటీ..


భారత్, మాల్దీవ్స్ మధ్య విభేదాలు (India Maldives Row) కొనసాగుతున్న క్రమంలోనే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో ఇటీవల భేటీ అయ్యారు. ఉగాండా రాజధాని కంపాలాలో ఈ సమావేశం జరిగినట్టు జైశంకర్ వెల్లడించారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. భారత్, మాల్దీవ్స్ మధ్య ద్వైపాక్షిక బంధంపై చర్చ జరిగినట్టు వివరించారు. రెండు రోజుల పాటు జరిగే Non-Aligned Movement (NAM) సమ్మిట్‌లో పాల్గొనేందుకు కంపాలా వెళ్లిన జైశంకర్...జమీర్‌తో ప్రత్యేకంగా చర్చించారు. ఈ ట్వీట్‌కి మూసా జమీర్ స్పందించారు. జైశంకర్‌ని కలవడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. X వేదికగా పోస్ట్ పెట్టారు. మాల్దీవ్స్‌లో భారతీయ సైనికులను ఉపసంహరించుకోవాల్సిన అంశంపైనా చర్చించినట్టు తెలిపారు. తమ దేశానికి అందించాల్సిన సహకారంపైనా చర్చ జరిగినట్టు చెప్పారు. 


"మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో కంపాలాలో సమావేశం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంపై చర్చించాం. దీంతో పాటు NAM కి సంబంధించిన చర్చలూ జరిపాం"


- ఎస్‌ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి


Also Read: తమిళనాడులో తేలిన పొత్తు లెక్కలు! DMK కూటమి తరపున కమల్ ప్రచారం