DMK led Alliance in Tamil Nadu: లోక్‌సభ ఎన్నికల ముందు అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు నాటకీయంగా మారిపోతున్నాయి. ఇంకా షెడ్యూల్ విడుదల కాకముందే అన్ని పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. అంతే కాదు. ఊహించని రీతిలో పొత్తు పెట్టుకుంటున్నాయి. తమిళనాడులోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్, డీఎమ్‌కే పొత్తు గురించి అందరికీ తెలిసిని విషయమే అయినా...ఉన్నట్టుండి కమల్ హాసన్ పార్టీ Makkal Needhi Maiam (MNM) కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌తో పాటు MNM తోనూ సీట్ల పంపకాలపై డీఎమ్‌కే తుది నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కి 10 సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే...కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్‌కి లోక్‌సభ ఎన్నికల్లో కాకుండా వచ్చే ఏడాది రాజ్యసభ ఎన్నికలకు ఓ సీట్ కేటాయించినట్టు సమాచారం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి సీట్‌లు కేటాయించే అవకాశాలైతే కనిపించడం లేదు. దేశ సంక్షేమం కోసం DMK కూటమితో చేతులు కలిపినట్టు కమల్ హాసన్ వెల్లడించారు. తాన ఏదో పదవి ఆశించి ఈ కూటమిలో చేరలేదని స్పష్టం చేశారు. 


"నేను ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కేవలం దేశ సంక్షేమం కోసమే DMK నేతృత్వంలోని కూటమితో చేతులు కలుపుతున్నాను. ఏదో పదవి కోసమో నేనీ నిర్ణయం తీసుకోలేదు. ఈ కూటమి నా సంపూర్ణ మద్దతు ఎప్పటికీ ఉంటుంది"


- కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత 






ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ని కలిసిన తరవాత కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో కూటమి తరపున ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే I.N.D.I.A కూటమిలో కాంగ్రెస్‌తో కలిసి పొత్తు పెట్టుకుంది డీఎమ్‌కే. 2019లో కాంగ్రెస్‌ తమిళనాడులో 8 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అటు డీఎమ్‌కే మొత్తం 38 చోట్ల గెలుపొందింది. ఈ సారి కూడా ఇవే ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


I.N.D.I.A కూటమిలోని ఒక్కో పార్టీ కాంగ్రెస్‌ వరుస పెట్టి విమర్శలు సంధిస్తున్నాయి. ఇప్పటికే జేడీయూ ఏకంగా బీజేపీతో పొత్తుకి సిద్ధమైంది. అటు ఆప్ కూడా కాంగ్రెస్‌కి దూరంగానే ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితీ ఇంతే. ఇప్పుడు మరో కీలక పార్టీ అయిన DMK కాంగ్రెస్‌పై అసహనం వ్యక్తం చేసింది. కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తోందంటూ డీఎమ్‌కే మంత్రి ఒకరు తీవ్ర విమర్శలు చేయడం సంచలనమవుతోంది. ఆ పార్టీకి మునుపు ఉన్న బలం లేదని, ఎప్పుడో బలహీనపడిపోయిందని స్పష్టం చేశారు డీఎమ్‌కే మంత్రి రాజా కన్నప్పన్. ఇది కేవలం ఆయన ఒక్కరి అభిప్రాయమా..? లేదంటే నిజంగానే డీఎమ్‌కే, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. 


Also Read: ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం ప్రారంభం, సేలా టన్నెల్‌కి ఎన్నో ప్రత్యేకతలు