India Protests Germany: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటని మందలించింది. ఢిల్లీలోని జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పిలిచి నిలదీసింది. భారత న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తేల్చి చెప్పింది. తమది ప్రజాస్వామ్య దేశంలో, చట్ట ప్రకారం ఏం జరుగుతుందో అదే జరుగుతుందని స్పష్టం చేసింది. అనవసరంగా ఏవేవో ఊహించుకుని మాట్లాడడం తగదని హెచ్చరించింది. ఈ మేరకు జర్మనీ తీరుని నిరసిస్తూ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
"భారత్ ఓ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ పటిష్ఠమైన చట్టాలున్నాయి. ఇలాంటి అవినీతి కేసుల్లో చట్ట ప్రకారమే అన్నీ జరుగుతాయి. భారత్‌లోనే కాదు. ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా జరిగేది ఇదే. పక్షపాత వ్యాఖ్యలు, అనవసరపు ఊహాగానాలు సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు"
- భారత ప్రభుత్వం
ఏం జరిగింది..?
అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్‌ని పారదర్శకంగా విచారించాలని, ఆయనకు చట్టపరంగానే ట్రయల్స్ నిర్వహించాలని అని వ్యాఖ్యానించింది జర్మనీ విదేశాంగ శాఖ. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇది తప్పకుండా జరగాలని వెల్లడించింది. దీనిపైనే భారత్ మండి పడింది.
"భారత్ ఓ ప్రజాస్వామ్య దేశం. ఈ కేసులో చట్ట ప్రకారమే విచారణ జరగాలి. మిగతా అందరిలాగే అరవింద్ కేజ్రీవాల్ అందుకు అర్హులు. ఎలాంటి పక్షపాతం, ఆంక్షలు లేకుండా ఆయన అన్ని విధాల చట్టపరమైన మార్గాలను ఆయనకు అందుబాటులో ఉంచాలి. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అవకాశమివ్వాలి. ఏ చట్టం లక్ష్యం అయినా ఇదే"
- జర్మనీ విదేశాంగ శాఖ
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు రెండు గంటల పాటు విచారించారు. ఇప్పటికే కోర్టులో హాజరుపరిచి పది రోజుల కస్టడీకి అనుమతి తీసుకుంది. ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ కోర్టులో స్పష్టం చేసింది. ఆప్, సౌత్ గ్రూప్‌కి మధ్య విజయ్ నాయర్ వారధిగా పని చేశారని వెల్లడించింది. మొత్తం 5 ప్రధాన అభియోగాలు చేసింది. ఈ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ భాగస్వామ్యం ఉందని స్పష్టం చేసింది. ఈ స్కామ్‌లో వచ్చి నిధుల్ని గోవా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించినట్టు వివరించింది. కొంత మందికి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించడంతో పాటు వాళ్ల నుంచి కేజ్రీవాల్ పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు చెప్పింది. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఉన్న సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు తెలిపింది.