Sunburn : సూర్య కిరణాలు మనకు హాని చేయవు. మన శరీరానికి అవసరమైన విటమిన్-డిని పుష్కలంగా అందిస్తుంది. మన ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తుంది. ఈ సూర్యరశ్మి చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. అయితే ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా మీ చర్మానికి హాని కలుగుతుంది. సన్ డ్యామేజ్ అనేది చర్మానికి హాని కలిగించే వాటిలో ఒకటి.సూర్యుని  హానికరమైన UV కిరణాలు చర్మంపై ఫైన్ లైన్లు, ముడతలు, నల్ల మచ్చలను కలిగిస్తాయి. ఇంకా చెప్పాలంటే అకాల వృద్ధాప్యానికి సూర్యకిరణాలను కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే సూర్య కిరణాల నుంచి  మీ చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. సూర్యుని నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. 


సూర్యరశ్మి గురించి తెలుసుకోవాలి:


సూర్యకిరణాలు మన చర్మానికి ఎలాంటి హాని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సూర్యుడి నుంచి విడుదలయ్యే యూవీ కిరణాలు, యూవీబీ కిరాణాలతో కూడిన అతినీలలోహిత కిరణాల ద్వారా రేడియేషన్ విడుదల అవుతుంది. ఈ రెండూ చర్మంలోకి చొచ్చుకుపోతాయి. వీటి వల్ల శరీరంలోని కణాలు దెబ్బతింటాయి. యూవీ కిరణాలు ప్రధానంగా సూర్యరశ్మికి దోహదం చేస్తాయి. ఇవి అకాల వృద్ధాప్యంతోపాటు చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 


బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి:


సూర్యరశ్మి నుంచి మన చర్మాన్ని రక్షించుకోవాలంటే సన్ స్క్రీన్ క్రమం తప్పకుండా ఉపయోగించాలి. 30 లేదా అంతకంటే ఎక్కువ ఎస్పీఎఫ్ తో యూవీఏ, యూవీబీ కిరణాల నుంచి రక్షించే స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి. ఎండలో బయటకు వెళ్లే పావు గంట ముందు మీ చర్మానికి సన్ స్క్రీన్ అప్లయ్ చేసుకోండి. ప్రతి రెండు గంటలకోసారి సన్ స్క్రీన్ అప్లయ్ చేస్తుండాలి. 


ఈ సమయంలో జాగ్రత్త


ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సమయాన్ని పీక్ అవర్స్ అంటారు. ఈ సమయంలో సూర్య రశ్మికి దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు ఈ సమయంలో బయటకు వెళ్లడం మానుకోండి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపి, పొడవాటి చేతులు ఉన్న దుస్తువులు ధరించడం మంచిది. 


కాటన్ దుస్తులు ధరించండి:


హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకునేందుకు వదులైన, లైట్ కలర్ దుస్తులు ధరించండి. ముఖ్యంగా కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ముఖం, మెడ, కళ్ళు వంటి సున్నితమైన ప్రాంతాలను సన్ గ్లాసెస్, వెడల్పుగా ఉన్న టోపీతో పెట్టుకోవడం మర్చిపోవద్దు. పుష్కలంగా నీరు తాగుతుండాలి. నీరు మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుంది. ఎందుకంటే సూర్యరశ్మి నిర్జలీకరణం, వేడి సంబంధిత అనారోగ్యాలకు దారితీస్తుంది.


యాంటీఆక్సిడెంట్లు వాడాలి:


విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు యూవీ రేడియేషన్ ద్వారా ఉత్పన్నమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొనడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సూర్యరశ్మి వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడటానికి మీ రోజువారీ దినచర్యలో యాంటీఆక్సిడెంట్లు కలిగిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను చేర్చుకోండి. యాంటీఆక్సిడెంట్‌లతో సమృద్ధిగా ఉన్న సీరమ్‌లు, మాయిశ్చరైజర్‌లు, సన్‌స్క్రీన్‌లను వాడటం మంచిది.



Also Read :  కరోనా తర్వాత పెళ్లిళ్లు పెరుగుతున్నాయట.. విడాకులు తగ్గుతున్నాయట.. కారణమిదే



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.