అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్.. అమెరికాకు ఓ ముఖ్యమైన భాగస్వామని ఈ సందర్భంగా కమలా తెలిపారు.
అమెరికాకు భారత్ ఓ ముఖ్యమైన భాగస్వామి. భారత్‌లో కరోనా విజృంభించిన సమయంలో ఆపన్నహస్తం అందించినందుకు అమెరికా గర్వపడుతోంది. వ్యాక్సినేషన్‌లో భారత్ చూపిస్తోన్న చొరవ బాధ్యతాయుతంగా ఉంది. త్వరలోనే వ్యాక్సిన్ ఎగుమతులు పునఃప్రారంభించాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ప్రస్తుతం రోజుకు దాదాపు కోటి మందికి భారత్ వ్యాక్సిన్ అందించడం నిజంగా ప్రశంసనీయం. - కమలా హారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలు
సహజమైన భాగస్వాములు..
కరోనా సమయంలో అమెరికా అందించిన సాయానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమలా హారిస్‌పై ప్రశంసలు కురిపించారు.
భారత్, అమెరికా దేశాలు సహజమైన భాగస్వాములు. ఇరు దేశాల్లోనూ ఒకే రకమైన విలువలు కనిపిస్తాయి. ఇరు దేశాల ప్రయోజనాల కోసం సమన్వయం, సహకారం పెరుగుతూనే ఉంది. అమెరికా- భారత్ ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాలే మన స్నేహానికి వారధిగా నిలిచాయి. ఇందులో ప్రవాస భారతీయుల పాత్ర ఎనలేనిది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారత్‌కు ఆపన్నహస్తం అందించినందుకు అమెరికాకు కృతజ్ఞతలు. - ప్రధాని నరేంద్ర మోదీ