దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించి వేగంగా పెరుగుతోంది. తాజాగా భారతదేశం ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసుకుంది.  మార్చినెలతో ముగిసిన గత త్రైమాసికంలో ఇది 6.1 శాతంగానే ఉంది.  గత త్రైమాసికంతో పోలిస్తే. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 1.7 శాతం ఎక్కువగా నమోదు కావడం విశేషం.  తాజాగా విడుదలైన జీడీపీ గణాంకాల పట్ల దేశ పారిశ్రామిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO 2023 ఆగస్టు 31న విడుదల చేసిన డేటా ప్రకారం.... భారత వృద్ధి అత్యధికంగా ఉంది.  ఈ వృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన సంస్కరణలు కారణమని చెప్పవచ్చంటూ పేర్కొంది.


అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవల భారతదేశ GDP వృద్ధి అంచనాను 2023కి 6.1 శాతానికి సవరించింది.  ఈ సంవత్సరం ప్రారంభంలో అంచనా వేసిన 5.9 శాతం నుండి బలమైన దేశీయ పెట్టుబడుల దృష్ట్యా వృద్ధి రేటు పెరిగే అవకాశముందని పేర్కొంది.


FY24లో భారతదేశం 6.5 శాతం వృద్ధి చెందుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంతకుముందు అంచనా వేసింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో వృద్ధి రేటు 8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 


ఈ అంచనాలన్నీ దాటుకుని  భారత వృద్ధి రేటు భారీగా పెరిగింది.  జూలైలో సేవల రంగం 13 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.  ప్రస్తుతం కొనసాగుతున్న జూలై-సెప్టెంబర్ త్రైమాసిక వృద్ధి గణాంకాలు నవంబర్ 30న విడుదల కానున్నాయి.


ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సేవారంగాల్లో వృద్ధి జోరందుకోవడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ అంచనాలను మించి నమోదు కావడానికి దోహదపడింది. ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ఆగస్టు 31 విడుదల చేసింది.  దీనికి ముందు ఆర్బీఐ సైతం భారత వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేయడం విశేషం.  ఈ అంచనాలను నిజం చేస్తూ భారత్ గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేసుకుంది. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతోనే ఇది సాధ్యం అయినట్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు సైతం పెరిగాయి.


అన్ని రంగాల్లో వృద్ధి చెందాలి.....
" ఆహారం నుంచి ఫార్మా వరకు, అంతరిక్షం నుంచి స్టార్ట్ అప్ వరకు ప్రతి రంగం అభివృద్ధి చెందాలి. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.   ప్రస్తుతం దేశీయ ఫార్మా రంగం విలువ 4 లక్షల కోట్లుగా ఉంది.  2030 నాటికి ఇది 10 లక్షల కోట్ల వరకు అభివృద్ధి చెందుతుందని అంచనా. 2030 నాటికి దేశీయ పర్యాటక రంగం సైతం 20 లక్షల కోట్ల విలువతో 14 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అంటే రాబోయే పదేళ్లలో  భారత్ ఎంతగానో వృద్ధి చెంది  యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయి" అని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జరిగిన రోజ్గార్ మేళాలో మాట్లాడారు. ఈ దశాబ్దంలోనే దేశంలోని ప్రతి సామాన్యునికి లబ్ధి చేకూరేలా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు.