India China Clash:
రెండ్రోజుల పాటు విన్యాసాలు..
తవాంగ్ ఘర్షణతో మరోసారి భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గల్వాన్ సమయంలో ఎలాంటి యుద్ధ వాతావరణం కనిపించిందో... ఇప్పుడూ అదే కనిపిస్తోంది. ఇప్పటికే...భారత సైన్యం అప్రమత్తమైంది. చైనాకు గట్టి బదులు చెప్పే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగానే...బల ప్రదర్శనకు దిగుతోంది. పరోక్షంగా చైనాకు హెచ్చరికలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా...భారత వాయుసేన రెండ్రోజుల పాటు విన్యాసాలు చేపట్టనుంది. ఈస్టర్న్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ ఎక్సర్‌సైజ్ జరగనుంది. ఈ నెల 15,16 వ తేదీల్లో సైనిక విన్యాసాలు చేపట్టనుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్ స్పేస్‌లో వీటిని నిర్వహించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) సన్నాహాలు చేస్తోంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు IAF ఓ నోటీస్ కూడా విడుదల చేసింది. వెస్ట్ బెంగాల్‌లోని హషిమరా, కలైకుండా, అసోంలోని తేజ్‌పూర్, ఝబువా, అరుణాచల్ ప్రదేశ్‌లోని అడ్వాన్స్ లోడింగ్ స్ట్రిప్...ఈ విన్యాసాల్లో పాలు పంచుకోనున్నాయి. మరో కీలక విషయం ఏంటంటే...ఈ విన్యాసాల్లో రఫేల్ మెరుపులు కనిపించనున్నాయి. దీంతో పాటు మరో ఫైటర్ జెట్ సుకోయ్‌నూ రంగంలోకి దింపనుంది భారత వాయు సేన. డిసెంబర్ 9వ తేదీన ఎల్‌ఏసీ వద్ద ఉన్న యాంగ్‌త్సే (Yangtse) ప్రాంతం వద్ద భారత్, చైనా సైనికుల మధ్య వివాదం తలెత్తింది. యాంగ్‌త్సే పైకి ఎక్కుతున్న భారత సైనికులను అడ్డుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యారు చైనా సైనికులు. అంతకు ముందే ఈ విన్యాసాలు నిర్వహించాలని భావించిన భారత వాయుసేన...ఇప్పుడు తవాంగ్‌లో మరోసారి ఘర్షణ తలెత్తడం వల్ల వెంటనే ఆ వ్యూహాన్ని అమలు చేసేందుకు రెడీ అయిపోయింది.
ఇదీ జరిగింది..
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంట ఘర్షణ జరిగింది. ఇందులో ఇరుపక్షాల సైనికులు గాయపడ్డారు. భారత సైన్యం ఈ అంశంపై ప్రకటన విడుదల చేసినా.. క్షతగాత్రుల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి. ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘర్షణపై భారత సైన్యం ప్రకటన విడుదల చేసినా.. క్షతగాత్రుల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. తొలుత ఆరుగురు సైనికులు గాయపడ్డారంటూ నివేదికలు వెలువడగా..
ఆ సంఖ్య 20కి పైగా ఉంటుందని ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. అయితే క్షతగాత్రుల సంఖ్య భారత్ కంటే చైనా వైపు అధికంగా ఉన్నట్లు సమాచారం.