India Canada Tensions: 


కెనడా అడ్వైజరీ..


భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో కెనడా కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది. 41 మంది దౌత్యవేత్తల్ని వెనక్కి రప్పించిన వెంటనే కెనడా ప్రభుత్వం ఈ గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. భారత్‌లోని రాయబార కార్యాలయాలనూ మూసేసింది. భారత్‌లోని కెనడా పౌరులంతా చాలా అప్రమత్తంగా ఉండాలని, అక్కడ ఉగ్రదాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరించింది. కెనడాకి వ్యతిరేకంగా కొందరు ఆందోళనలు చేస్తున్నారని, కెనడా పౌరులనూ వేధించే అవకాశముందని తేల్చి చెప్పింది. తెలియని వ్యక్తులతో మాట్లాడడం తగ్గించాలని, వ్యక్తిగత వివరాలనూ ఎవరికీ ఇవ్వొద్దని తమ పౌరులకు సూచించింది. 


"భారత్‌ కెనడా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని ఇండియాలోని కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలి. కొంత మంది కెనడాకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. సోషల్ మీడియా, మీడియాలో కెనడాపై విషం చిమ్ముతున్నారు. ఇలాంటి ప్రచారాల వల్ల కెనడా పౌరులపై దాడులు జరిగే ప్రమాదముంది. ఢిల్లీతో పాటు మిగతా ప్రాంతాల్లోని కెనడా పౌరులు వీలైనంత వరకూ బయటకు రాకండి. కొత్త వాళ్లతో మాట్లాడకండి. ఎవరికి పడితే వాళ్లకి వ్యక్తిగత వివరాలు ఇవ్వకండి"


- కెనడా


రాయబార కార్యాలయాలు బంద్..


ముంబయి, ఛండీగఢ్, బెంగళూరులోని రాయబార కార్యాలయాలను మూసేసింది కెనడా. టూరిస్ట్‌ ప్లేస్‌లలోనూ కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది ఆ దేశ ప్రభుత్వం. కావాలనే టార్గెట్ చేసి దాడులు చేయడం లేదా చోరీలకు పాల్పడడం లాంటివి జరిగే అవకాశముందని వెల్లడించింది. ఎక్కువ మొత్తంలో డబ్బులు పట్టుకుని బయటక తిరగొద్దని సూచించింది. గత నెల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేసినప్పటి నుంచి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కెనడాలో హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ హస్తం ఉందని ఆరోపించారు ట్రూడో. దీనిపై భారత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆధారాల్లేకుండా ఆరోపించడం సరికాదని మండి పడింది. అంతర్జాతీయంగానూ కెనడా విమర్శలు ఎదుర్కొంది. ఇలాంటి ఆరోపణల వల్ల రెండు దేశాల మధ్య మైత్రి దెబ్బతింటుందని స్పష్టం చేసింది. 


భారత్,కెనడా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జాలీ రహస్యంగా భేటీ అయినట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితమే వీళ్లిద్దరూ వాషింగ్టన్‌లో సమావేశమైనట్టు కొన్ని నివేదికలు వెల్లడించాయి. బ్రిటీష్ న్యూస్‌పేపర్ Financial Times కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అయితే...ఈ రహస్య సమావేశంపై ఇటు భారత్ కానీ అటు కెనడా కానీ స్పందించలేదు. ఆ రిపోర్ట్‌లు చెప్పిన దాన్ని బట్టి చూస్తే...భారత్‌తో వివాదాన్ని పక్కన పెట్టి ఉద్రిక్తతలు తగ్గించేందుకు కెనడా సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని ఇప్పటికే కెనడా ప్రకటించింది. కానీ...ఇప్పటి వరకూ పరిస్థితులు అదుపులోకి రాలేదు. పైగా అమెరికా కూడా ఇందులో జోక్యం చేసుకోవడం సంక్లిష్టంగా మారింది. కెనడా చేస్తున్న ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకుని విచారణకు సహకరించాలని భారత్‌కి అగ్రరాజ్యం సలహాలిచ్చింది. ఈ వ్యాఖ్యలూ కాస్త దుమారం రేపాయి. 


Also Read: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు, 23 వారాల ప్రెగ్నెన్సీ అబార్షన్‌కి అనుమతి