Pakistan Toshakhana Case: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలారు. ఈ నేపథ్యంలో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఐదేళ్లపాటు అనర్హత వేటు పడింది. అంతేకాకుండా రూ.100,000 జరిమానా కూడా విధించింది. శనివారం విచారణ సందర్భంగా తోషాఖానా కేసులో మాజీ ప్రధానిపై అభియోగాలు రుజువైనట్లు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి (ADSJ) హుమాయున్ దిలావర్ తీర్పు చెప్పారు.


ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌కు ఉద్దేశపూర్వకంగా నకిలీ వివరాలను సమర్పించారని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 174 ప్రకారం ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కోర్టు ఆదేశాల అమలు కోసం ఇస్లామాబాద్ పోలీసు చీఫ్‌కు ఆర్డర్ కాపీని పంపాలని కూడా ADSJ దిలావర్ ఆదేశించారు.


తోషాఖానా అంటే ఏంటి?
ప్రభుత్వానికి వచ్చే కానుకలను భద్రపరిచే ఖజానాను తోషాఖానా అంటారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. 2018 నుంచి 2022 మధ్య కాలయంలో ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు రూ.140 మిలియన్ల విలువైన కానుకలను అందుకున్నారు. వాటిని ఖజానాకు జమ చేయకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 


అన్ని అమ్మేశాడు
అయితే ఇమ్రాన్‌ తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించారు. పైగా వాటిని అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఈసీకి లేఖ కూడా రాశారు. 2018, సెప్టెంబర్‌ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన కానుకలను ప్రభుత్వానికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్‌ తీసుకున్నారని, వాటిని మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. వాటిలో వజ్రాల రిస్ట్‌ వాచీలు, ఉంగరాలు, కఫ్‌లింక్స్‌ పెయిర్, రోలాక్స్‌ వాచీలు, పెన్నులు పెర్‌ఫ్యూమ్స్, ఐ ఫోన్లు, మసీదు, అత్తర్‌ బాటిల్స్‌ నమూనాలు, కళాకృతులు అత్యంత ఖరీదైనవి కూడా ఉన్నాయి. కేవలం మూడు వాచీలను రూ.3.6 కోట్లకు అమ్ముకున్నట్లుగా తేలింది. 


పీఎంఎల్ విచారణ
పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ (పీఎంఎల్‌–ఎన్‌) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషాఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్‌ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ము కున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్‌ గద్దె దిగిన తర్వాత తోషాఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు మిగల్లేదని పేర్కొంది. ఈ కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి (ADSJ) హుమాయున్ దిలావర్ తీర్పు చెప్పారు.
 
ఇమ్రాన్‌ఖాన్‌పై 140 కేసులు
ఇమ్రాన్ ఖాన్‌ దేశవ్యాప్తంగా 140కి పైగా కేసులు ఎదుర్కొంటున్నారు. ఉగ్రవాదం, హింస, దైవదూషణ, అవినీతి, హత్య వంటి ఆరోపణలపై ఆయన నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అవిశ్వాస ఓటింగ్‌లో ఓడిపోయిన తర్వాత ఖాన్‌ను అధికారం నుంచి తొలగించారు, రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్‌లపై తన విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా అమెరికా తనను లక్ష్యంగా చేసుకుందని, అందుకే పాకిస్తాన్‌లో కట్రలకు తెరతీసిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.