ఆర్టీసీ విలీనం బిల్లు తెలంగాణలో కాక రేపుతోంది. ఇప్పటికే ఈ బిల్లుపై గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ మధ్య వార్ నడుస్తుంటే... ఇప్పుడు సీన్‌లోకి ఆర్టీసీ కార్మికులు రావడంతో వివాదం మరింత రాజుకుంది. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడించడం సంచలనంగా మారుతోంది. 


రాజ్‌భవన్ వద్ద బైఠాయించిన కార్మిక సంఘాలు ప్రభుత్వం పంపిన ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదానికి పట్టుబడుతున్నారు. వెంటనే ఆమోదించి ప్రభుత్వానికి తిరిగి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బిల్లుపై సందేహాలు ఉన్నాయన్న గవర్నర్‌ ఆఫీస్‌ ఆమోదానికి టైంకావాలని శుక్రవారం నుంచి సమాచారం అందిస్తున్నారు. 


ఏకంగా కార్మికులు రాజ్‌భవన్‌కు ముట్టడికి పిలుపునివ్వడం, ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో గవర్నర్ నేరుగా స్పందించారు. తాను ఎప్పుడూ కార్మికుల పక్షమేనని అన్నారు. గతంలో సమ్మె జరిగినప్పుడు కూడా కార్మికుల తరపున మాట్లాడినట్టు గుర్తు చేశారు. కార్మికులకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే విలీనం బిల్లుపై అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా కార్మిక సంఘాలకు గవర్నర్‌ చర్చలకు పిలిచారు. బిల్లుపై ఉన్న సందేహాలు చర్చించేందుకు రావాలని తాను ఎందుకు ఆ బిల్లును ఆమోదించకుండా స్టడీ చేస్తున్నానో చెప్పబోతున్నారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కాసేపట్లో కార్మిక సంఘాల నాయకులతో గవర్నర్‌ తమిళి సై మాట్లాడనున్నారు.