వైఎస్ షర్మిల పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె కొత్త పార్టీ ప్రకటనతో హీట్ పెరిగింది.


తండ్రి మాజీ ముఖ్యమంత్రి, అన్న ప్రస్తుత ముఖ్యమంత్రి.. పక్కా రాజకీయ నేపథ్యం ఉన్న  కుటుంబం.. ఇది సింపుల్​గా చెప్పాలంటే షర్మిల ప్రొఫైల్. 


అయితే జగనన్న వదిలిన బాణం.. తెలంగాణలో వాలడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇక్కడ ప్రతిపక్షం దీటుగా లేదనా..? లేక బలంగా మారకూడదనా? కేసీఆర్​తో సహా టీఆర్​ఎస్​ పార్టీపై ఘాటుగా విమర్శలు చేస్తున్న షర్మిల.. బీజేపీని ఒక్క మాట కూడా అనకపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందా? అసలు తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఏంటి? 


అన్నను కాదని.. అసలు వ్యూహమేంటి?


ప్రభుత్వ వైఫల్యాలతో పాటు వైఎస్ఆర్ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని చెబుతూ ప్రజల్లోకి వెళ్లాలని షర్మిల నిర్ణయించినట్లు సమాచారం. అయితే అన్న.. జగన్‌మోహన్ రెడ్డితో విభేదాల కారణంగానే ఆమె కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారని ఊహాగానాలు విహరించినా.. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడం కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. 


జగన్‌తో విభేదాలు ఉంటే ఏపీలో పార్టీ పెట్టాలి గానీ తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. వైసీపీ ఆంధ్రాపార్టీగా ముద్రపడడం వల్లే తెలంగాణలో కొత్తపార్టీతో చెల్లెలు రంగం సిద్ధం చేసిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.


టార్గెట్​ కాంగ్రెస్​..!


ఇటీవల పీసీసీ చీఫ్​గా నియమితులైన రేవంత్​ రెడ్డి.. కాంగ్రెస్​ను మళ్లీ గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్​ను  వీక్​ చేయడానికే షర్మిల పార్టీ పెట్టారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డిపై షర్మిల విమర్శనాస్త్రాలు సంధించడం ఇందుకు బలం చేకూరుస్తుంది. అయితే అధికారపక్షంపైనా షర్మిల గట్టిగానే ఆరోపణలు చేస్తున్నారు. కానీ భాజపాను ఇప్పటివరకు ఒక్క మాట కూడా అనకపోవడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది.


ఎవరు వదిలిన బాణం..?


రాజశేఖరరెడ్డి నుంచి లబ్ధి పొందిన వాళ్లు ఆమెకు సహకరించే అవకాశం ఉందని ఓ విశ్లేషణ కూడా ఉంది. అయితే ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకంలా కనిపిస్తోందని కొంత మంది కాంగ్రెస్​ నేతలు అంటుంటే..  కేసీఆర్​ యే పార్టీ పెట్టించి..ప్రతిపక్షాల ఓట్లు చీల్చి లబ్ధి పొందాలని చూస్తున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.


ప్రభావం చూపుతుందా?


తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ సమయంలో వైఎస్ షర్మిల ఏ మేరకు ప్రభావం చూపనున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా ఆయన అభిమానులతోనే పార్టీని నడపాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణలోని జిల్లాల్లో ఎంత మేరకు ప్రభంజనం సృష్టిస్తారోనని అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు.


ఈ నేపథ్యంలో షర్మిల ఏమేరకు విజయం సాధిస్తారు? పార్టీలోకి ఎవరిని తీసుకుంటారు? ఎలా ప్రచారం చేస్తారు అనే విషయాలు ఉత్కంఠ రేపుతున్నాయి.


ఎవరు చేరతారు..?


ఆయా పార్టీలలో పని చేసినా తగిన గుర్తింపు దక్కకపోవడంతో కొత్త పార్టీల వైపు చూసే నేతలు ఎక్కువగానే ఉన్నారు. అలాంటి వారంతా షర్మిల పార్టీలోకి చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.


కల నెరవేరుతుందా?


అన్న ఉన్నంత వరకు ఆంధ్రాలో ఆధిపత్యం దొరికే అవకాశం లేకే షర్మిల తెలంగాణ వైపు చూశారనేది కొంతమంది వాదన. పైగా అంత కష్టపడినా అక్కడ సరైన గుర్తింపు ఇవ్వలేదనే ఆవేదన ఇటీవల షర్మిల కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీతో ప్రభంజనం సృష్టిస్తారా? ఆంధ్రా అమ్మాయి అనే ముద్రను ఎలా చెరిపేస్తారు? ఎంత మేరకు ప్రభావం చూపిస్తారనేది వేచి చూడాలి.