Green Alerts Mausam Sewa: భారత వాతావరణ విభాగం (Indian Meteorology Department - IMD) 150వ వార్షికోత్సవం సందర్భంగా పౌరులకు కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటిదాకా వాతావరణ శాఖ ప్రముఖ నగరాలు, పట్టణాలు, ప్రాంతాల వారీగా వర్షపాతం, వర్షం అంచనా, ఉష్ణోగ్రతల సమగ్ర సమాచారం అందిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇకపై మరింత హైపర్ లోకల్ గా వాతావరణ అంచనాలు పౌరులకు లభించనున్నాయి. అంటే దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో వాతావరణం ఎలా ఉంటుందనే సమాచారాన్ని వాతావరణ విభాగం అధికారులు అందించడం మొదలుపెట్టారు. పైగా ఈ సమాచారం హిందీ, ఇంగ్లీషు మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడం లాంటి 12 భారతీయ భాషల్లో లభించనుంది. ప్రతికూల వాతావరణం కారణంగా పంట నష్టం తగ్గించి, రైతులకు ఉత్పత్తి, ఆదాయాన్ని పెంచడానికి ఈ సేవలు దోహదం చేస్తాయి. 


వాతావరణ విభాగ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర ఇటీవల ఓ జాతీయ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. పంట నష్టాల నుంచి చిన్న సన్నకారు రైతులను కాపాడడం కోసం ఐఎండీ అందిస్తున్న ఈ సేవలు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. వాతావరణ సూచనల్ని మండలాల (బ్లాకుల, తాలూకాల) స్థాయి నుంచి గ్రామాల స్థాయికి తీసుకువెళ్లడం సాధ్యమైందని తెలిపారు. పంచాయతీ స్థాయి వాతావరణ సేవలు ఇవ్వడం ద్వారా దేశంలోని ప్రతి గ్రామంలో కనీసం ఐదు మంది రైతులతో అనుసంధానం కావడం అనేది తమ లక్ష్యమని.. తద్వారా వాతావరణ అంచనాల సమాచారం రైతులకు సులభంగా తెలుస్తుందని తెలిపారు. తీవ్రమైన వాతావరణ హెచ్చరికలతోపాటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం, గాలుల వేగం వంటి వివరాలను ‘పంచాయతీ వాతావరణ సేవ’ ద్వారా పొందవచ్చని తెలిపారు.


దేశంలో ఏ మూల ఉన్నవారైనా నిర్దేశిత మొబైల్‌ యాప్‌ సాయంతో తమ సొంత రాష్ట్రం, జిల్లా, మండల పరిధిలోని సొంతూరి వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చని మహాపాత్ర తెలిపారు. మరికొన్ని గంటల్లో వాతావరణం ఎలా మారుతుందనే వివరాలను కూడా ఆ యాప్ నుంచి, లేదా వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చని చెప్పారు. వ్యవసాయ పనులు, నిర్మాణపు పనులు ప్రారంభించేముందు, పెళ్లిళ్లు చేసేవారు, అవుట్ డోర్ ఈవెంట్లు ప్లాన్ చేసుకునే వారు వాతావరణ అంచనాలు సరిచూసుకోవాలని చెప్పారు. రాబోయే అయిదేళ్లలో తమ రాడార్లు 39 నుంచి 86కి పెరుగుతాయని, రాష్ట్రాలతో కలిసి ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాలను పెంచుతున్నామని మహాపాత్ర తెలిపారు.


ఈ వెబ్ సైట్‌లో సమస్త వాతావరణ సమాచారం
www.greenalerts.in అనే ఈ వెబ్ సైట్ ఓపెన్ చేయడం ద్వారా కావాల్సిన భాషలో సమాచారాన్ని చూడవచ్చు. హోం పేజీలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కనిపిస్తాయి. వాటిలో రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసుకొని.. ఆ తర్వాత జిల్లా పేరు ఎంచుకోవాలి. ఆ తర్వాత మండలాలు బ్లాక్ ల పేరుతో కనిపిస్తాయి. అక్కడ వాతావరణానికి సంబంధించి సమస్త సమాచారం తెలుసుకోవచ్చు.


భారత వాతావరణ శాఖ, భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ, గ్రీన్ అలర్ట్ మౌసమ్ సేవ సంయుక్తంగా పంచాయత్ మౌసం సేవా పోర్టల్‌ను అభివృద్ధి చేశాయి. ప్రాంతీయ భాషలలో వాతావరణ సూచనలు దేశంలోని ప్రతి గ్రామానికి అందేలా.. ప్రతి పంచాయతీ హెడ్, పంచాయతీ కార్యదర్శికి చేరవేయడం జరుగుతుంది.


గ్రీన్ అలర్ట్స్‌ వెబ్‌సైట్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి