Isha Ambani Twins: దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ముఖేశ్ అంబానీ మరోసారి తాతయ్య అయ్యారు. వియ్యంకులైన అంబానీ కుటుంబం, పిరామల్ కుటుంబాల్లో ఆనంద వాతావరణం నెలకొంది.


సంయుక్త మీడియా ప్రకటన
ఇషా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని రెండు అంబానీ కుటుంబం, పిరామల్ కుటుంబం కలిసి అధికారికంగా ప్రకటించాయి. శనివారం (19 నవంబర్ 2022) ఇషా అంబానీకి కవలలు జన్మించారని, వారిలో ఒకరు మగ శిశువు, మరొకరు ఆడ శిశువు అని ఆ ప్రకటనలో రెండు కుటుంబాలు వెల్లడించాయి. ఇషా అంబానీ భర్త పేరు ఆనంద్‌ పిరామల్‌. ఇషా అంబానీ తల్లిదండ్రులు ముఖేష్ & నీతా అంబానీ - ఆనంద్ పిరామల్ తల్లిదండ్రులు అజయ్ & స్వాతి పిరామల్ కలిసి మీడియా ప్రకటన చేశారు. 


తల్లి ఇషాతో పాటు ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. కవలలకు జన్మనిచ్చిన వెంటనే ఆ ఇద్దరు పసివాళ్లకు పేర్లు కూడా పెట్టారు. ఇషా అంబానీ కుమారుడి పేరు కృష్ణ అని, కూమార్తె పేరు ఆదియా అని నామకరణం చేశారు.


దేవుడు తమ కుటుంబాలను కవలలతో దీవించాడని, పసివాళ్ల రాకతో తామ రెండు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయని సంయుక్త ప్రకటనలో రెండు కుటుంబాలు వెల్లడించాయి. తల్లీపిల్లలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ చిన్నారులను అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఇది వాళ్ల జీవితంలో అత్యంత ముఖ్యమైన దశగా మీడియా ప్రకటనలో వియ్యంకులు వెల్లడించారు. ఈరోజు అంటే ఆదివారం మధ్యాహ్నం మీడియా ప్రకటనలో ఈ సమాచారాన్ని రెండు కుటుంబాలు అందించాయి. 


అంబానీ కుటుంబంతోపాటు పిరామల్ కుటుంబం కూడా దేశ వ్యాపార రంగంలో పాతుకుపోయింది. దేశంలోని అతి పెద్ద వ్యాపార సంస్థల్లో పిరామల్ గ్రూప్‌ కూడా ఒకటి. 


2018లో ఒకటైన ఇషా అంబానీ - ఆనంద్ పిరామల్
ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి, పిరామల్ గ్రూప్‌ సంస్థల యజమాని అజయ్ పిరామల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌కు వివాహం అత్యంత ఆర్భాటంగా జరిగింది. ఈ వివాహం దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిళ్ల జాబితాలో చేరింది. దేశ సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు పెళ్లికి తరలి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.


ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్
ముఖేష్ అంబానీ ముద్దుల కుమార్తె ఇషా అంబానీ రిలయన్స్‌ గ్రూప్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే, రిలయన్స్ రిటైల్ (Reliance Retail) వెంచర్స్ డైరెక్టర్‌గా ఆమెను ముఖేష్‌ నియమించారు. రిలయన్స్ రిటైల్ వ్యాపారం మొత్తాన్నీ ఇప్పుడు ఆమె చూసుకుంటున్నారు. ఇప్పుడు, వ్యాపారంతో పాటు ఇద్దరు పిల్లల బాధ్యత కూడా ఆమెపై పడింది. 


రూ.800 కోట్ల ఆస్తి
celebritynetworth.com నివేదిక ప్రకారం, ఇషా అంబానీ పేరిట ఉన్న ఆస్తుల నికర విలువ 100 మిలియన్ డాలర్లు పైమాటే. అంటే 800 కోట్ల రూపాయలకు పైగా ఆస్తిపాస్తులు ఆమె సొంతం. 2015లోనే, ఆసియాలో 12 అత్యంత శక్తిమంతమైన వర్ధమైన వ్యాపార మహిళల జాబితాలో ఆమె పేరు చేరింది.