Bandi Sanjay : ఏకాత్మ మానవతావాదమే బీజేపీ మూల సిద్ధాంతమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అధికారం కోసం బీజేపీ ఏనాడూ అడ్డదారులు తొక్కబోదనన్నారు. మూల సిద్ధాంతం ఆధారంగానే తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ప్రశిక్షణా శిబిరాల ముఖ్య ఉద్దేశమన్నారు. బీజేపీ తెలంగాణ ప్రశిక్షణా శిబిరం ప్రారంభ సమావేశానికి బండి సంజయ్ , కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర శాఖ మూడు రోజులపాటు నిర్వహించే ప్రశిక్షణా శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. అధికారంలోకి రావడానికి శిక్షణా శిబిరాలు అక్కర్లేదనే భావన కొందరిలో ఉంటుందని కానీ సరైనా విధానం కాదన్నారు. నాటి జనసంఘ్ నుండి నేటి వరకు ప్రతి రెండేళ్లకోసారి శిక్షణా శిబిరాలు కొనసాగిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. బీజేపీ ఏనాడూ అధికారం కోసం అర్రులు చాచలేదని, అడ్డదారులు తొక్కలేదని బండి సంజయ్ అన్నారు. మూల సిద్ధాంతం ఆధారంగా అధికారంలోకి రావాలనుకుంటున్నామన్నారు.
మూడోసారి అధికారంలోకి
"మూల సిద్ధాంతం జాతీయత ఏకాత్మక మానవతావాదం. దేశ ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యం మనం. పార్టీ అధికారంలోకి రావాలనుకుంటే ఎప్పుడో వచ్చే వాళ్లం. ఎన్నో పార్టీలు అడ్డదారులు తొక్కి అధికారం సాధించాయి. కానీ బీజేపీ మాత్రం సిద్ధాంతానికి అనుగుణంగా అధికారంలోకి రావాలనుకున్నాం. అందుకే ఇన్నాళ్లు పట్టింది. పార్లమెంట్ లో విశ్వాస పరీక్ష సమయంలో వాజ్ పేయి ప్రభుత్వం మనుగడ సాధించాలంటే ఒక్క ఎంపీ తక్కువయ్యారు. అడ్డదారులు తొక్కకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్లిన ఘనత బీజేపీదే. బీజేపీలో మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రశిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో మూల సిద్ధాంత ప్రాతిపదికగా తెలంగాణలో అధికారంలోకి రావాలన్నదే ఈ ప్రశిక్షణా శిబిరం ముఖ్య ఉద్దేశం. ఆనాడు 2 ఎంపీ సీట్ల నుంచి నేడు 303 సీట్లకు విస్తరించాం. రెండోసారి అధికారంలోకి వచ్చాం. మూడోసారి కూడా రాబోతున్నాం. ఏనాడూ సిద్ధంతాన్ని పక్కనపెట్టలేదు. " - బండి సంజయ్
కార్ల రేసింగ్ పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారా?
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ‘ఇండియన్ రేసింగ్ లీగ్’ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకొస్తే ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా మెరుగ్గా కార్ల రేసింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. కార్ల రేసింగ్ కు పెట్టే ప్రతి పైసా, వసూళ్ల వివరాలను పారదర్శకంగా వెల్లడిస్తామన్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో హైదరాబాద్ నడిబొడ్డున కార్ల రేస్ ట్రయల్స్ ను నిర్వహిస్తూ ప్రజలకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నగర ప్రజలు పూర్తిగా ట్రాఫిక్ తో సతమతమవుతున్నారన్నారు. అత్యవసర అంబులెన్స్ సర్వీసులు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయని ఆరోపించారు. కార్ల రేస్ కోసం నగరం నడిబొడ్డున సెక్రటేరియట్, ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు పరిసరాలన్నీ పోలీసులు దిగ్బంధించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఆయా రోడ్లన్నీ బ్లాక్ చేయడంవల్ల ఏర్పడిన తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలకు, ప్రజలకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
ప్రతీ పైసా పారదర్శకంగా
"టీఆర్ఎస్ నేతలు నగర శివారుల్లో వేలాది ఎకరాలు కబ్జా చేశారు. ఆ స్థలాల్లో ఇట్లాంటి రేసులు నిర్వహించుకోవచ్చు కదా? నగరం నడిబొడ్డున నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు భావ్యం? కార్ల రేసింగ్ నిర్వహణకు బీజేపీ వ్యతిరేకం కాదు, కార్ల రేసింగ్ ను స్వాగతిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కార్ల రేసింగ్ నిర్వహించాలన్నదే బీజేపీ ఉద్దేశం. అయితే ట్రాఫిక్ కు ఇబ్బంది లేని రీతిలో శాశ్వత ప్రాతిపదికన కార్ల రేసింగ్ నిర్వహించాలి. అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో ప్రజాధనాన్ని అడ్డగోలుగా లెక్కా పత్రం లేకుండా ఖర్చు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. కార్ల రేసింగ్ పేరుతో ఖర్చు పెట్టే ప్రతి పైసాతోపాటు టిక్కెట్ల పేరుతో వసూలు చేసే డబ్బు వివరాలను సైతం ప్రజలకు అందుబాటులో ఉండేలా పారదర్శకంగా వ్యవహరిస్తాం." - బండి సంజయ్