భారతదేశంలో ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి యాంటీ బాడీలు వృద్ధి చెందాయని.. భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ప్రతి ముగ్గురిలో ఒకరు చొప్పున అంటే దేశంలో సుమారు 40 కోట్ల మందికి కోవిడ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. 2021 జూన్, జూలై నెలల మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించింది. దీని కోసం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 70 జిల్లాల ప్రజలను పరీక్షించింది. ఈ జిల్లాల్లో మే- జూన్ (2020), ఆగస్టు- సెప్టెంబర్ (2020), డిసెంబర్- జనవరి (2020-2021) మధ్య కాలంలో ఇదే తరహా సర్వేలను నిర్వహించింది. ఈ సర్వేలకు సంబంధించిన సమాచారాన్ని ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ విడుదల చేశారు.  
దేశంలో కోవిడ్ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు ఐసీఎంఆర్ సర్వేలను నిర్వహిస్తోంది. శరీరంలో యాండీ బాడీల సంఖ్యను అంచనా వేసేందుకు ఈ సర్వేలను నిర్వహిస్తోంది. వీటిని సెరో సర్వేలు (sero survey) అంటారు. ఈ సర్వేల ద్వారా ఐసీఎంఆర్ 28,975 మందిని పరీక్షించింది. ఈ సర్వేలలో 6 నుంచి 17 సంవత్సరాల వయసున్న పిల్లలను కూడా కలిపింది. వీరితో పాటు 7,252 మంది హెల్త్ వర్కర్లు ఉన్నారు. 
నాలుగు రౌండ్ల సర్వే పూర్తయ్యాక ఫలితాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 67.6 శాతం మందిలో యాండీ బాడీలు వృద్ధి చెందినట్లు పేర్కొంది. ఇది మే- జూన్ (2020) లతో పోలిస్తే 0.7 శాతం, ఆగస్టు- సెప్టెంబర్ (2020) లతో పోలిస్తే  7.1 శాతం, డిసెంబర్- జనవరి (2020-2021) లతో పోలిస్తే 24.1 శాతం ఎక్కువని తెలిపింది. హెల్త్ వర్కర్లలో 85 శాతం మందికి యాండీ బాడీస్ తయారైనట్లు గుర్తించింది.


యాంటీ బాడీలు వృద్ధి చెందినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. దేశంలో ప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరికి కోవిడ్ ప్రమాదం ఉందని హెచ్చరించింది. 
తెలంగాణలో పిల్లల్లో 55 శాతం.. పెద్దల్లో 61 శాతం.. 
తెలంగాణలోనూ నాలుగో విడత సీరో సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఐసీఎంఆర్‌ సీరో సర్వే నిర్వహించినట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) వెల్లడించింది. పెద్ద వారిలో 61 శాతం, పిల్లల్లో 55 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయని గుర్తించినట్లు తెలిపింది. 
వ్యాక్సిన్ తీసుకుంటే ముప్పు తక్కువే..
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై కూడా ఐసీఎంఆర్ అధ్యయనం నిర్వహించింది. దేశవ్యాప్తంగా 677 మందిని పరీక్షించింది. ఒక డోస్ లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి రాలేదని.. వీరిలో 9.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని తెలిపింది. మరణాల రేటును తగ్గించడంలో కూడా వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేసినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మరణాల శాతం 0.4గా ఉందని చెప్పింది.