UP IAS Officer Remark:


యూపీ వరద బాధితులపై ఆగ్రహం..


యూపీలో వరద బాధితుల పట్ల ఓ కలెక్టర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. వరద బాధితుల ఇంటికి ఫుడ్‌ పంపించటానికి ప్రభుత్వం "జొమాటో సర్వీస్‌"నడపటం లేదని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కొన్ని రోజులుగా ఉత్తర్‌ప్రదేశ్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. గాఘరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయితే..ఓ రిలీఫ్ క్యాంప్‌ వద్దకు వచ్చిన అంబేడ్కర్ నగర్ జిల్లా కలెక్టర్ సామ్యూల్ పాల్ వరద బాధితులతో మాట్లాడారు. సహాయక చర్యలు ఎలా ఉన్నాయో ఆరా తీశారు. ఈ క్రమంలోనే నోరు జారారు. "మీకు క్లోరిన్ మందులు ఇస్తాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్లు వచ్చి పరీక్షిస్తారు. ఈ రిలీఫ్ క్యాంప్‌ల ఉద్దేశం కూడా అదే" అని అన్నారు. ఆహారం గురించి వరద బాధితులు అడిగిన ప్రశ్నకు "ఆహారం ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలా..? ప్రభుత్వం జొమాటో సర్వీస్‌ నడపడం లేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. అప్పటి నుంచి ఆ కలెక్టర్‌పై విమర్శలు మొదలయ్యాయి. "ఆయన జొమాటో గురించి చెప్పిన అర్థం కాకుండా చూస్తూ ఉండిపోయారు. వాళ్లకు ఏం అర్థమైందో దేవుడికే తెలియాలి" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. "ప్రభుత్వం జొమాటో సర్వీస్‌ నడపడం లేదని అందరికీ తెలుసు. కానీ...మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారి. ప్రజలకు సేవ చేయటం మీ విధి" అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు. మరో నెటిజన్ అయితే...ఇంకాస్త వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు. "ఈ సర్కారీ బాబు కన్నా.. జొమాటో డెలివరీ బాయ్స్ ఎంతో ఆలోచించి మాట్లాడతారు" అని పోస్ట్ చేశాడు.