Hash oil Smuggling in Hyderabad: హైదరాబాద్ లో హషీస్ ఆయిల్ (గంజాయి నూనె) ను విక్రయిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. వీరు పాత నేరస్తులని.. విశ్వసనీయ సమాచారం మేరకు ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర వారు  సరకు అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నట్లుగా బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి బాలనగర్ డీసీపీ మంగళవారం (జనవరి 23) ప్రెస్ మీట్ నిర్వహించారు. నిందితుల వద్ద నుంచి 2 లీటర్ల హషీస్ ఆయిల్, ఒక పల్సర్ ద్విచక్ర వాహనం, రూ.1,200 నగదు, మూడు సెల్ ఫోన్లు, సిరంజీలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మొత్తం హషీస్ ఆయిల్ విలువ దాదాపు రూ.1.12 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులను బాలరాజు (29), సతీష్ (24), నగేష్ (28) గా గుర్తించారు. నాగార్జున (21) అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసుల విచారణలో నిందితుడు పాత నేరస్తులయిన అంపిలి బాలరాజు లీటరుకు రూ.35,000/- హషీస్ ఆయిల్‌ను నాగార్జున నుండి కొనుగోలు చేసి, దానిని మాడుగుల సతీష్ అలియాస్ సత్యబాబు , బ్యాగరి నగేష్‌లకు విక్రయించి, ప్రతి ఐదు మిల్లీలీటర్ల చొప్పున చిన్న పెట్టెలుగా మార్చి చుట్టుపక్కల విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. బోయిన్‌పల్లి, హైదరాబాద్ నగరంలోని విద్యాసంస్థల విద్యార్థులకు ఒక్కొక్కటి రూ.2500 కు విక్రయించి సులభంగా డబ్బు సంపాదిస్తున్నట్లు తెలిసింది.


బాలరాజు స్వగ్రామానికి పండుగకు వెళ్లి నాగార్జునను కలసి శ్రీకాకుళంలో హషీస్ ఆయిల్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకువచ్చే క్రమంలో బాలనగర్ ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర పోలీసుల తనిఖీలో పట్టు పడ్డారు. నిందితుల నుంచి 2 లీటర్ల హషీష్ ఆయిల్ (5 మిల్లీ లీటర్ల 920 బాటిల్స్) తో పాటు రూ.1200 నగదు, మూడు మొబైల్స్, ఓ పల్సర్ బైక్, 72 ఖాళీ బాటిల్స్ తో పాటు సిరంజిల ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సరకు విలువ రూ.12 లక్షలు ఉంటుందని, ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు బాలనగర్ డీసీపీ తెలిపారు.