హైదరాబాద్ క్లాస్, మాస్ ప్రజలతో కలగలిపిన మహానగరం. కాస్ట్ ఆఫ్ లివింగ్‌లోనూ ది బెస్ట్. మధ్యతరగతి ప్రజలకు... హైదరాబాద్ నగరం ఎంత అనువుగా ఉంటుందో... ధనవంతులకు కూడా అంతే సౌకర్యంగా మారుతోంది. అన్ని వర్గాల ప్రజలకు... ఆకర్షిస్తోంది. ఫారెన్ కంట్రీలను తలపించే రీతిలో... రూపుదిద్దుకుంటోంది. వ్యాపార రంగంలో ముందుకు దూసుకుతోంది. హైదరాబాద్‌లో హైస్ట్రీట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అసలు ఈ హైస్ట్రీట్స్ అంటే ఏంటి..?
హైస్ట్రీట్స్ అంటే.. మంచి షాపింగ్ అనుభూతి కలిగించే వీధులు. ఫుడ్‌కోర్టులు, షాపింగ్‌మాల్స్, గేమింగ్ జోన్స్, రిటైల్ షాపులు, మల్టీప్లెక్స్‌లు ఇలా అన్నీ కలిపి ఓ వ్యాపారకూడలిగా మారే ప్రాంతాలను హైస్ట్రీట్స్‌గా పిలుస్తారు. కాస్మోపాలిటన్ సిటీలకు ఈ హైస్ట్రీట్సే ఆకర్షణ. పెద్ద పెద్ద భవనాలు... రాత్రి అయితే వెలుగుజిలుగులతో మెరిసిపోయే అందాలు.. ఈ హైస్ట్రీట్స్ సొంత. అక్కడి వెళ్తే హైటెక్ అందాలను చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. నగరంలో ఏ మూల నుంచి అయినా ఈ హైస్ట్రీట్స్‌కు రవాణా సౌకర్యం ఉంటుంది. ఆధునిక వసతులు, పార్కింగ్, వినోద, విహార సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇన్ని సౌకర్యాలు అందించే ఈ హైస్ట్రీట్స్ అత్యంత కాస్ట్‌లీ కూడా. హైస్ట్రీట్‌లలో చదరపు అడుగుల ఆదాయం షాపింగ్ మాల్స్‌లో కంటే ఎక్కువగా ఉంటుంది. హైస్ట్రీట్స్‌లో చదరపు అడుగుల ఆదాయం ఏడాదికి సుమారు రూ.36.42 లక్షలు కాగా..షాపింగ్ మాల్స్‌లో రూ.11.31 లక్షలుగా ఉంటుంది.
దేశంలోని టాప్-10 హైస్ట్రీట్స్‌లో హైదరాబాద్‌లోని సోమాజీగూడకు రెండు స్థానం దక్కింది. దేశంలోని అన్ని మాహానగరాల్లో మెరుగైన షాపింగ్ అనుభూతిని అందించే అత్యుత్తమ హైస్ట్రీట్ మార్కెట్లలో హైదరాబాద్‌లోని సోమాజిగూడది సెకండ్ పొజిషన్. ఈ లిస్టులో బెంగళూరులోని మహాత్మా గాంధీ రోడ్డు మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంస్థ నైట్‌ఫ్రాంక్.. థింక్ ఇండియా థింక్ రిటైల్-2023 హైస్ట్రీట్ రియల్ ఎస్టేట్ ఔట్‌లుక్ పేరుతో సర్వే నిర్వహించి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం... షాపింగ్‌కు సోమాజిగూడ అత్యంత అనుకూలంగా ఉందని తెలిపింది. ఇక్కడికి వచ్చే కొనుగోలుదారులకు స్థానిక రిటైల్ వ్యాపారులు కల్పిస్తున్న పార్కింగ్ వసతులు, ఇతర సౌకర్యాలు చాలా బాగున్నాయని వెల్లడించింది. దేశంలోని టాప్ 20 హైస్ట్రీట్స్ జాబితాలో హైదరాబాద్ నుంచి సోమాజిగూడతోపాటు ఐదు ప్రాంతాలున్నాయి. ఇందులో గచ్చిబౌలి 16వ స్థానం, అమీర్‌పేట్ 17, బంజారాహిల్స్ 18, జూబ్లీహిల్స్ 19వ స్థానంలో నిలిచాయి.
ఇక, ఆధునిక రిటైల్ హైస్ట్రీట్స్‌లో NCRదే అగ్రస్థానం.. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 30 హైస్ట్రీట్స్ ఉండగా...ఈ హైస్ట్రీట్స్ 1.32 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్థలంలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 52 లక్షల చదరపు అడుగుల స్థలంతో ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతంలోని ఎన్‌సీఆర్ తొలిస్థానంలో ఉండగా..18 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్ మలిస్థానంలో నిలిచింది. ఇక అహ్మదాబాద్, బెంగళూరు ఒక్కో నగరంలో 15 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. ఆధునిక రిటైల్ స్పేస్ పరంగా చూస్తే...ఎనిమిది ప్రధాన నగరాలలో 57 లక్షల చదరపు అడుగుల వాటా ఉండగా..14 లక్షల చదరపు అడుగులతో ఎన్‌సీఆర్ అగ్రస్థానంలో.. 11 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచాయి.