Bengaluru woman husband death: గుండెను మెలిపెట్టే ఘటన ఇది. బెంగగళూరులో 34 ఏళ్ల మెకానిక్ వెంకటరమణన్ హార్ట్ అటాక్‌తో మరణించాడు. రెండు ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స నిరాకరించడం, రోడ్డుపై ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన భర్తకు సాయం చేయాలని అతని భార్య ఎంత మందిని వేడుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన చనిపోయారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
బెంగళూరు బనశంకరి III స్టేజ్‌లోని బాలాజీ నగర్ నివాసి వెంకటరమణన్ (34), గ్యారేజీ మెకానిక్. డిసెంబర్ 13 అర్ధరాత్రి సుమారు 3:30 గంటలకు ఇంట్లో ఉన్నప్పుడు తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. భార్య రూపా కె వెంటనే స్కూటర్‌పై భర్తను తీసుకెళ్లి సమీపంలోని కత్రిగుప్పెలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ లేరు అని చేర్చుకునేందుకు తిరస్కరించారు. తర్వాత రీ-లైఫ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఈసీజీ చేసి "మైల్డ్ హార్ట్ అటాక్" అని నిర్ధారించారు. కానీ ప్రాథమిక చికిత్స ఇవ్వలేదు, ఆంబులెన్స్ ఏర్పాటు చేయలేదు. జయదేవ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. జయదేవ ఆస్పత్రి వైపు స్కూటర్‌పై వెళ్తుండగా కడిరేనహళ్లి సమీపంలో ప్రమాదం జరిగింది. ఇద్దరూ కింద పడ్డారు. వెంకటరమణన్ తీవ్రంగా గాయపడ్డాడు. రూపా రక్తంతో తడిసి, రోడ్డుపై పడి ఉన్న భర్త పక్కన నిలబడి చేతులు జోడించి వాహనాలను ఆపమని వేడుకున్నారు. అనేక వాహనాలు వెళ్లిపోయాయి. ఎవరూ ఆగలేదు. చివరకు ఒక క్యాబ్ డ్రైవర్ ఆగి, వెంకటరమణన్‌ను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు అతన్ని చనిపోయినట్లుగా ప్రకటించారు.
తాను రక్తంతో తడిసి, సాయం కోసం వేడుకున్నా ఎవరూ రాలేదని ఆ భార్య కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక్కరు సాయం చేసి ఉంటే నా భర్త బతికి ఉండేవాడని ఆమె వేదన చెదుతోంది.అంత వేదనలోనే ఆమె భర్త కళ్లు దానం చేశారు. వెంకటరమణన్‌కు 5 ఏళ్ల కొడుకు, 18 నెలల కూతురు ఉన్నారు. అతని తల్లికి ఆరుగురు పిల్లలు. ఐదుగురు ఇప్పటికే మరణించారు. వెంకటరమణన్ చివరి సంతానం. మరణ వార్త విని తల్లి కూడా హార్ట్ అటాక్‌కు గురైంది, కానీ చికిత్సతో కోలుకుంది.
అత్యవసర చికిత్సలో ఆస్పత్రుల నిర్లక్ష్యం, ఆంబులెన్స్ సౌకర్యాల లోపం, ప్రజల్లో మానవత్వం లోపం వంటి ప్రశ్నలు ఈ ఘటనతో చర్చకు వస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ, సామాజిక వర్గాలు స్పందించాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.