HP Election 2022:


60కిపైగా సీట్లు వస్తాయి: సుర్జీత్ సింగ్ 


ఈ ఏడాది గుజరాత్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఇక్కడి ఎన్నికల తేదీలు కూడా ప్రకటించారు. అటు గుజరాత్‌తో పాటు హిమాచల్‌లోనూ భాజపాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఆప్. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బలంనిరూపించుకుంటామని ఆమ్‌ఆద్మీ అధినేత కేజ్రీవాల్ చాలా సందర్భాల్లో చెప్పారు. అటు భాజపాను టార్గెట్ చేస్తూ విమర్శలూ చేస్తున్నారు. అంతే కాదు. హిమాచల్‌ ప్రదేశ్‌లో తమకు ఎన్ని సీట్లు వస్తాయో కూడా జోస్యం చెబుతున్నారు కొందరు ఆప్‌ నేతలు. హిమాచల్ ఆప్‌ అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ ఠాకూర్ ఇటీవలే ఈ లెక్కలు వివరించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌నకు 60కిపైగా సీట్లు వస్తాయని చాలా ధీమాగా చెబుతున్నారు. 
మొత్తం 68 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామన్న సుర్జీత్ సింగ్...60కిపైగా సీట్లు వస్తాయని చెప్పటమే చర్చనీయాంశమైంది. అయితే..కేజ్రీవాల్ మాత్రం హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల కన్నా గుజరాత్ ఎలక్షన్లనే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో భాజపాకు గట్టి పోటీ ఇస్తే...అది జాతీయ అంశమూ అవుతుందని భావిస్తున్నారు. హిమాచల్‌ ఎన్నికలపై కేజ్రీవాల్ శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలకూ సుర్జీత్ సింగ్ సమాధానమిచ్చారు. "ఏ రాష్ట్రాన్నీ నిర్లక్ష్యం చేయటం లేదు. నవంబర్ 3వ తేదీన కేజ్రీవాల్ ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. రానున్న రోజుల్లో ప్రచారాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తాం. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌, ఢిల్లీ డిప్యుటీ  సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరో 20 మంది స్టార్ క్యాంపెనర్లతో ప్రచారం చేస్తాం. పార్టీ మొత్తం క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉంది" అని స్పష్టం చేశారు. 


413 మంది అభ్యర్థులు..


హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 413 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 92 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సొంత జిల్లా మండిలోని జోగిందర్ నగర్ స్థానంలో అత్యధికంగా 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 551 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఆ తర్వాత వారిలో 46 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు. 505 మంది పోటీకి అర్హత సాధించారు, అయితే 92 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మొత్తం అభ్యర్థుల సంఖ్య 413కి చేరుకుంది. 413 మంది అభ్యర్థుల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తలా 68 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ వారి పార్టీ అభ్యర్థులను నిలబెట్టాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 12న జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది.


Also Read: Hyderabad Metro Charges: మెట్రో రైల్ ఛార్జీల పెంపునకు అంతా రెడీ, ఎంత పెంచాలో మీరూ చెప్పొచ్చు - ఇలా చేయండి