Iran War:  యుద్ధం అంటే గగనతలంలో గర్జించే జెట్లు, నేలపై పేలే బాంబులు అనుకుంటాం. కానీ ఈసారి కథ అక్కడి నుంచి మొదలుకాలేదు. ఇరాన్‌పై దాడి చేయాలనుకున్న ఇజ్రాయెల్-U.S అద్భుతమైన స్కెచ్ వేశాయి. బాంబర్లు, జెట్లు ఇలా దాడిచేస్తే.. ఇరాన్ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ వారిని అడ్డుకుంటుందని తెలుసు. ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అమలు చేశాయి. అసలు యుద్ధం మొదలైంది ఆకాశంలో కాదు... రాడార్‌ స్క్రీన్‌లపైనే.. US-ISRAEL చేపట్టిన సైబర్, Decoy,  ఎయిర్ అటాక్‌లకు ఇరాన్ బిత్తరపోయింది.  ఆధునిక వార్‌ఫేర్ ఏలా మారిపోతోందో ఈ అటాక్ కళ్లకు కట్టింది. 

Continues below advertisement

ఇరాన్ కళ్లకు గంతలు కట్టిన అమెరికా..

ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనిచేయలేకపోయింది? సూటిగా చెప్పాలంటే — ప్రత్యర్థి సాంకేతిక సామర్థ్యం పూర్తిగా ఇరాన్‌కు అందనంత స్థాయిలో ఉంది. ఇరాన్ ఎయిర్‌ డిఫెన్స్‌ను చేధించడం కోసం యుఎస్ సైబర్ వార్‌ఫేర్‌ను ఉపయోగించింది. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, సైబర్ ఆపరేషన్లు కలిసి రాడార్‌లలోకి నకిలీ డేటాను పంపించాయి. అంటే పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు ఇరాన్‌ వైపు దూసుకొస్తున్నట్లుగా స్క్రీన్‌పై కనిపిస్తుంది.కానీ అవన్నీ వాస్తవాలు కావు. ఇరాన్‌లోని  స్వదేశీ బావర్ వ్యవస్థలైనా, రష్యా నుంచి వచ్చిన S-300, S-400 బ్యాటరీలైనా — ఒకేసారి వచ్చిన డిజిటల్ దాడిని తట్టుకోలేకపోయాయి. రాడార్ ఆపరేటర్‌కు ఏది నిజం? ఏది మోసం? అర్థం కాని పరిస్థితి.

Continues below advertisement

ఇదే సమయంలో వందల సంఖ్యలో ADM-160 Miniature Air Launched Decoys (MALD) డీకాయ్ డ్రోన్లు ప్రయోగించారు. ఇవి చిన్నవే. కానీ రాడార్‌కు మాత్రం F-15లు, F-16ల పెద్ద స్క్వాడ్రన్‌లా కనిపిస్తాయి. టెహ్రాన్ వైపు భారీ దళం దూసుకొస్తున్నట్టే సిగ్నల్ వస్తుంది. ఇక ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా వాళ్ల వెంట పడుతుంది. Decoy డ్రోన్లను డీల్ చేయడంలో ఇరాన్ ఎయిర్‌డిఫెన్స్‌ సిస్టమ్ బిజీగా ఉన్న సమయంలోనే F-35, F-22లు ఇరాన్‌ భూభాగంపైకి వెళ్తాయి. అసలేం జరుగుతుందో ఇరాన్‌కు అర్థమయ్యే లోపు  వారి రక్షణ ముఖద్వారం బద్ధలైపోయింది.

US-ISrael  సంయుక్త దళాలు ఈ ఆపరేషన్ ను మూడు దశల్లో చేయాలని నిర్ణయించాయి. ఈ త్రిముఖ దాడితో ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి.

మొదటి దశ: టెహ్రాన్, ఇలామ్, ఖుజెస్టాన్ ప్రాంతాల్లోని సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సైట్లు, రాడార్ స్టేషన్లు, గాలి రక్షణ హెడ్‌క్వార్టర్స్‌ను టార్గెట్ చేశారు.రెండో దశ: బ్యాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లు, నిల్వ కేంద్రాలపై దాడులు.మూడో దశ: సైనిక తయారీ పరిశ్రమలపై దృష్టి. దీర్ఘకాల యుద్ధ సామర్థ్యాన్ని బలహీనపరచడం లక్ష్యం.

అసలు దాడి సముద్రం నుంచి..

. ఇక అసలైన భౌతిక దాడి సముద్రంపై నుంచి మొదలైంది. ఇరాన్‌కు దగ్గరలో ఉన్న అమెరికన్ Destroyers  నుంచి Tomahawk మిస్సైల్స్ పైకి లేచాయి. ఇవి శత్రు రాడార్‌లకు దొరక్కుండా చాలా తక్కువ ఎత్తులో దూసుకెళ్లాయి.అంతకుముందే F-౩5,  F-22 రాప్టర్లు వెళ్లడంతో అప్పటికే  రాడార్‌లపై తప్పుడు లక్ష్యాలు, ఎలక్ట్రానిక్ జ్యామింగ్ — ఈ కలయికతో ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్ విచ్చిన్నం అయింది. ఆ సమయంలో చాలా తక్కువ ఎత్తులో వచ్చి టామ్‌హాక్స్‌ S-300, S-400 రాడార్ సైట్లు, కమాండ్ బంకర్లపై దాడి చేశాయి. సో.. శత్రుదేశాల ఎటాక్స్‌ను డేగకళ్లతో పర్యవేక్షించే డిఫెన్స్ సిస్టమ్‌కు కళ్లే లేకుండా పోయాయి. ఇరాన్‌ గగనతలంపైకి తమ ఫైటర్‌జెట్లు దూసుకువెళ్లేలా సేఫ్‌ కారిడార్‌ను విజయవంతంగా సృష్టించిన తర్వాత అసలు కథ మొదలైంది. 

సిల్వర్‌ బుల్లెట్స్ అటాక్

ఎయిర్‌డిఫెన్స్, మిలటరీ స్థావరాలను ధ్వంసం చేశాక.. ఇక మిగిలిన లక్ష్యాలను చేధించడానికి బాంబర్స్ వచ్చేశాయి. అవి ఒకేసారి JDAM బాంబులు, మిస్సైళ్లను తీసుకెళ్లగలవు. ఇందుకోసం B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లను తెచ్చారు. ఇవి భూమి మీదనే కాదు.. భూమిలోపల ఉండే బంకర్లను కూడా ధ్వంసం చేయగలుగుతాయి. అదే సమయంలో జోర్డాన్, UAEలోని అమెరికన్ బేస్‌ల నుంచి.. F-15E Strike Eagles దూసుకొచ్చాయి. ఒక్కో జెట్ 19 JDAMలు లేదా 28 చిన్న డయామీటర్ బాంబులు మోసుకెళ్లగలదు. ఇవి ప్రధానంగా మూవింగ్ టార్గెట్స్ ను చేధిస్తాయి. అంటే వాహనాలపై నుంచి ప్రయోగించే Surface to Air Missile సిస్టమ్‌ను గుర్తించి దానని ధ్వంసం చేస్తుందన్నమాట..  లోయల్లో దాగి ఉన్న మొబైల్ మిస్సైల్ లాంచర్లు, కమాండ్ సెంటర్లపై దాడులు జరిపాయి.ఎంతగా ప్లాన్‌ చేశారు అంటే ఒకసారి దాడి చేసిన తర్వాత ఇవి తిరిగి వెళ్లవు. మళ్లీ దాడి చేయడానికి వీలుగా వీటికి ఆకాశంలోనే ఇంధనాన్ని నింపే Mid Air Fueling  కూడా చేశారు. అందుకే ఇంధనాన్ని నింపుకుని వచ్చి మళ్లీ మళ్లీ దాడులు చేశాయి. ఇజ్రాయెల్, యుఎస్ అంత కచ్చితమైన స్కెచ్‌ వేశాయి. 

ఫ్లోటింగ్ ఎయిర్‌బేస్‌లు రంగంలోకి వచ్చాయి. 

ఓ పక్క వైమానిక దళం డిస్ట్రక్షన్ చేసేస్తుంటే.. దానికి సపోర్ట్‌గా U.S Navy రంగంలోకి వచ్చింది. రెండు గంటల తర్వాత US ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు అరేబియా సముద్రం నుంచి ఆపరేషన్ మొదలుపెట్టింది. F/A-18 సూపర్ హార్నెట్లు యాంటీ రాడియేషన్ మిస్సైళ్లతో మిగిలిన రాడార్‌లను వేటాడాయి. F-35Cలు ఇంటెలిజెన్స్ సేకరణతో పాటు హై రిస్క్ టార్గెట్‌లపై దాడి చేశాయి. E-2 హాకాయ్ ఎయిర్‌క్రాఫ్ట్ మొత్తం గగనతల చలనాన్ని కోఆర్డినేట్ చేసింది.  ఇరాన్‌ ను ఊపిరి తీసుకోకుండా ముప్పేట దాడి చేశారు. ఎంతలా అంటే ప్రతీ 30 సెకన్లకు ఒక విమానం లాంచ్ అయ్యేలా ఆపరేషన్ సాగింది. అంటే ఇరాన్‌ గగనతలంపై ఏ రేంజ్‌లో విమానాలు గుంపు ఎగిరి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని వైపులా నుంచి దాడిని ఇరాన్‌ చేధించలేకపోయింది. అందుకే సూర్యోదయానికి చేతులెత్తేసింది. 

అందనంత దూరం.. అత్యంత క్లిష్టం 

ఇజ్రాయెల్ యుఎస్ ఒక్కరోజులోనే ప్రధాన టార్గెట్లను చేధించాయి కానీ.. ఇది అనుకున్నంత ఈజీ అయితే కాలేదు. సెంట్రల్ ఇరాన్ చేరుకోవాలంటే.. దాదాపు 900 నుంచి 1200మైళ్ల దూరం జెట్లు ప్రయాణించాలి. పైగా జోర్డాన్, సిరియా, ఇరాక్ గగనతలాల పైనుంచి లేదా వాటిని తప్పించుకుని వెళ్లాలి. అంతదూరం ప్రయాణిస్తున్నప్పుడు మిడ్ ఎయిర్ ఫ్యూయలింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి. జియాగ్రఫికల్, ఫంక్షనింగ్ చాలెంజ్‌లు ఉన్న ఈ ఆపరేషన్‌లో ప్రతీ అడుగూ కచ్చితంగా జాగ్రత్తగా వేయాల్సిందే. 

ఇరాన్ ప్రతి దాడి 

దాడికి సమాధానంగా ఇరాన్ Operation Truthful Promise 4 పేరిట భారీ మిస్సైల్, డ్రోన్ దాడి ప్రారంభించింది. దూరంగా ఉన్న అమెరికాను ఏం చేయలేక యుఎస్‌ మిత్రదేశాలపై దాడులు మొదలు పెట్టింది.  యూఏఈలోని Al Dhafra Air Baseపై దాడి చేశారు. బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ Fifth Fleet ప్రధాన కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేశారు. సోమవారం సాయంత్రానికి  ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయంపై కూడా దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

డికాయ్ ఆపరేషన్స్, సైబర్ ఎటాక్, వంటివి ఫ్యూచర్ వార్‌ఫేర్‌లో ఏ రీతిలో ప్రాధాన్యం వహిస్తున్నాయో ఈ ఆపరేషన్ చెబుతోంది.