New Parliament Visit:
సాధారణ ప్రజలకు విజిట్
ఎన్నో రోజులుగా ఎదురు చూసిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ఘనంగా పూర్తైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ నిర్మాణంపై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రతి అణువులోనూ దేశ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించారు. మరి ఈ కొత్త పార్లమెంట్‌ని సాధారణ ప్రజలు చూసే అవకాశముందా..? అయితే..దానికి ప్రాసెస్ ఏంటి..? విజిటింగ్‌కి అవకాశం ఎప్పుడిస్తారు..? దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఎంట్రీ పాస్ గురించీ సమాచారమిచ్చారు. అయితే..ఇదేమంత సింపుల్ కాదు. వెంటనే లోపలకు వెళ్లిపోయి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఫొటోలు తీసుకోవడం కుదరదు. పార్లమెంట్‌ని విజిట్ చేయాలంటే పక్కాగా వాళ్లు చెప్పిన ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి. నిజానికి ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ రాకపోయినా..విశ్వసనీయ వర్గాల ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి.
స్పెషల్ పాస్ తప్పనిసరి..
సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఆ ప్రొసీడింగ్స్ చూడటానికి సాధారణ ప్రజలకు అవకాశముంటుంది. ఇందుకోసం హౌజ్‌లో ఓ స్పెషల్ ఆడియెన్స్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ప్రొసీడింగ్స్‌ని చూడొచ్చు. ఇప్పుడు కొత్త పార్లమెంట్‌లోనూ ఇదే ప్రాసెస్ ఫాలో అవనున్నారు. ఇలా చూడాలంటే మాత్రం స్పెషల్ పాస్ తీసుకోవాల్సిందే. గ్రూప్ పాస్‌లతో పాటు పర్సనల్ పాస్‌లు కూడా ఉంటాయి. స్కూల్ పిల్లల్నీ తీసుకెళ్లేందుకు అవకాశముంటుంది. పార్లమెంట్ సెక్రటేరియట్ ఈ పాస్‌లు తయారు చేస్తుంది. ఎవరైనా ఎంపీని కలిసి కూడా ఈ పాస్ తీసుకోవచ్చు. ఎంపీ రికమండేషన్ లేకుండా పార్లమెంట్‌లోకి వెళ్లే అవకాశం ఉండదు. ఆయన రికమెండ్ చేస్తే పార్లమెంట్ సెక్రటేరియట్ పాస్‌ని జారీ చేస్తుంది. అయితే...ప్రొసీడింగ్స్ చూడాలంటే ఈ ప్రాసెస్ ఉంటుంది. కానీ...పార్లమెంట్ మ్యూజియం అయితే నేరుగా చూడొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా పాస్ అవసరం లేదు. పార్లమెంట్‌కి సంబంధించిన కీలకమైన వస్తువులు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకూ ప్రధానమంత్రులు వినియోగించిన వస్తువులూ అక్కడ చూడొచ్చు.
సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా పార్లమెంట్ ఇంటీరియర్‌ని డిజైన్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి టేకుని తెప్పించారు. మీర్జాపూర్ నుంచి కార్పెట్‌లు తీసుకొచ్చారు. ఫ్లోరింగ్ కోసం త్రిపుర నుంచి కర్ర పట్టుకొచ్చారు. రాజస్థాన్ నుంచి రాళ్లు వచ్చాయి. ఇలా రకరకాల రాష్ట్రాల నుంచి మెటీరియల్ తీసుకొచ్చి లోపల అందంగా తీర్చి దిద్దారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌కి ఇది ప్రతీక అని కేంద్రం చెబుతోంది. ఎరుపు, తెలుపు శాండ్‌స్టోన్స్‌ని రాజస్థాన్‌లోని సర్మతుర నుంచి తెప్పించారు. అప్పట్లో ఢిల్లీలోని ఎర్రకోట నిర్మాణానికీ ఇక్కడి రాళ్లనే వాడారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి టేకుని తీసుకొచ్చారు. కేసరియా గ్రీన్ స్టోన్‌ని ఉదయ్‌పూర్ నుంచి తెప్పించారు. అజ్మేర్ నుంచి రెడ్ గ్రనైట్, రాజస్థాన్‌లోని అంబాజీ నుంచి మార్బుల్‌ను పట్టుకొచ్చారు. ఫర్నిచర్ అంతా ముంబయిలోనే తయారైంది. కేంద్ర పాలిత ప్రాంతమైన దమన్ అండ్ దియు నుంచి ఫాల్ సీలింగ్ స్టీల్ స్ట్రక్చర్‌ని తీసుకొచ్చారు. వీటినే రాజ్యసభ, లోక్‌సభ సీలింగ్ కోసం వినియోగించారు. అశోక చిహ్నాన్ని తయారు చేసేందుకు ఔరంగాబాద్, జైపూర్ నుంచి మెటీరియల్ తెప్పించారు.
Also Read: New Parliament Opening: కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం