Same Sex Marriage:


సంవర్థిని న్యాస్ సర్వే 


RSS అనుబంధ సంస్థ సంవర్థిని న్యాస్ (Samwardhini Nyas) స్వలింగ వివాహాలపై (Same Sex Mariage) కీలక వ్యాఖ్యలు చేసింది. సేమ్ సెక్స్ మ్యారేజ్‌లతో ఎన్నో రోగాలొస్తాయని తేల్చి చెప్పింది. వైద్యులు కూడా ఇదే చెబుతున్నారని వాదిస్తోంది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే ఈ జబ్బులు పెరిగిపోయే ప్రమాదముందని వెల్లడించింది. రాష్ట్ర సేవిక సమితికి అనుబంధంగా ఉండే ఈ సంస్థ...దీనిపై ఓ సర్వే కూడ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న పలువురి వైద్యుల అభిప్రాయాలు సేకరించింది. మొత్తం 318 మంది డాక్టర్లను సంప్రదించింది. అలోపతితో పాటు ఆయుర్వేద వైద్యుల అభిప్రాయాలూ తీసుకుంది. ఆ తరవాతే ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వైద్యుల్లో దాదాపు 70% మంది స్వలింగ వివాహాలు రోగాలు కొనితెస్తాయని చెప్పినట్టు సర్వే తెలిపింది. హోమో సెక్సువల్ సంబంధాల వల్ల అంటురోగాలు వచ్చే ప్రమాదముందని 83% మంది డాక్టర్లు తేల్చి చెప్పారని వివరించింది. 


"వైద్యులందరినీ సంప్రదించాం. సర్వే చేశాం. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తే అనవసరమైన రోగాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుందని వాళ్లు చెప్పారు. సొసైటీకి ఇది చాలా ప్రమాదకరం. వాళ్లను మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడం కూడా కష్టమే అవుతుంది. ఇలాంటి సైకలాజికల్ డిసార్డర్‌తో బాధ పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మనసు మార్చాలి. ఇలాంటి రిలేషన్స్‌కి చట్టబద్ధత కల్పించే ముందు ప్రజల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలి"


- సంవర్థిని న్యాస్, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ 


కేంద్రం కమిటీ..


స్వలింగ వివాహాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొద్ది రోజులుగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్‌లపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం తన వాదన వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు ప్రస్తావించింది. స్వలింగ వివాహం చేసుకున్న వాళ్లు సొసైటీలో ఎదుర్కొనే సమస్యల గురించి చర్చించింది. కొన్ని ఉదాహరణలూ చెప్పింది. రోజువారీ లైఫ్‌లో వచ్చే సమస్యలతో పాటు, జాయింట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చా లేదా..? ఇన్సూరెన్స్ పాలసీలో ఆ వ్యక్తిని నామినీగా పెట్టొచ్చా లేదా అన్న అంశాలనూ తెరపైకి తీసుకొచ్చింది. ప్రాక్టికల్‌గా ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయన్న అంశంపైనా ఈ కమిటీ దృష్టి సారించనుంది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు కోర్టుకి వెల్లడించారు. క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై 5గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. ఏప్రిల్ 27వ తేదీన ఈ కమిటీ కేంద్రం అభిప్రాయాలేంటో చెప్పాలని అడిగింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడాన్ని పక్కన పెడితే అలాంటి వ్యక్తులకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు వర్తిస్తాయా లేదా చెప్పాలని కేంద్రాన్ని అడిగింది ధర్మాసనం. అయితే...కేంద్రం మాత్రం స్వలింగ వివాహాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇది చట్టపరిధిలోని అంశం అని...సుప్రీంకోర్టు కలగజేసుకోకపోవడమే మంచిదని చెప్పింది. 


Also Read: Viral Video: కారు కింద దూరిన 15 అడుగుల కోబ్రా,ఎలా బయటకు తీశారో చూడండి - వైరల్ వీడియో