Lord Buddha Relics Returns: బుద్ధుడితో పాటు ఆయన ఇద్దరి శిష్యులు అరహంత్ సరిపుట్ట, మహా మొగ్గల్లన అవశేషాలు థాయ్‌లాండ్ నుంచి భారత్‌కి తిరిగొచ్చారు. 26 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో పలు చోట్ల ఆ అస్థికల్ని ప్రదర్శించారు. ఆ తరవాత మళ్లీ వాటిని  భారత్‌కి తీసుకొచ్చారు. కేంద్రమంత్రి మీనాక్షి లేఖి వాళ్లకి స్వాగతం పలికారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఫిబ్రవరి 22వ తేదీన  వీటిని థాయ్‌లాండ్‌కి పంపారు. పాలమ్‌లోని ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్‌కి వాటిని తిరిగి తీసుకొచ్చారు. థాయ్‌లాండ్‌లో లక్షలాది మంది ఆ అవశేషాలకి పూజలు నిర్వహించారు. ఈ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయిన వెంటనే రెడ్‌కార్పెట్ వేసి ఆహ్వానించారు. ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్ టర్మినల్ బిల్డింగ్ వరకూ ఘన స్వాగతం పలికారు. కేంద్రమంత్రి మీనాక్షి లేఖి బౌద్ధ అవశేషాలున్న భరణిని స్వయంగా తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన బౌద్ధులను ఉద్దేశిస్తూ కీలక ప్రసంగం చేశారు. ఈ మేరకు X వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. 


"బౌద్ధ అవశేషాల్ని ఇలా భారత్‌కి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అరహంత్ సరిపుట్ట, అరహంత్ మహా మొగ్గల్లన అవశేషాలు కూడా భారత్‌కి వచ్చాయి. థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వీటిని ఇలా రిసీవ్ చేసుకోవడం నాకెంతో గౌరవంగా ఉంది. గత 25 రోజుల్లో థాయ్‌లాండ్‌లోని 40 లక్షల మంది బౌద్ధులు ఆ అవశేషాలకు పూజలు నిర్వహించారు. బుద్ధుని సిద్ధాంతాలు భారత్‌, థాయ్‌లాండ్‌కి మధ్య వారధిగా నిలిచాయి. ఈ బంధం ఎంతో బలమైంది"


- మీనాక్షి లేఖి, కేంద్రమంత్రి







ఈ సందర్భంగా ఆమె ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలనూ షేర్ చేశారు. థాయ్‌ ప్రజలు ఈ అవశేషాల ప్రదర్శనపై ఎంతో ఆసక్తి చూపించారని తెలిపారు. థాయ్‌తో పాటు కంబోడియా, లావోస్, వియత్నాంకి చెందిన ప్రజలు కూడా పూజలు నిర్వహించినట్టు వెల్లడించారు. బుద్ధుడు చెప్పిన ధమ్మపధం ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండిపోతుందని స్పష్టం చేశారు మీనాక్షి లేఖి. ఈ కార్యక్రమంలో మీనాక్షి లేఖి, అభిజీత్ హల్దార్ లతో పాటు బౌద్ధ మత గురువులు, వందల మంది వారి శిష్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. వీరంతా బుద్ధ భగవానుడు, ఆయన శిష్యుల పవిత్ర అస్థికలకు ప్రత్యేక పూజలు చేసి, ఆనందంతో పరవశులయ్యారు.ఈ క్రతువులన్నీ ముగిసిన తర్వాత బుద్ధుడు, ఆయన శిష్యుల పవిత్ర అస్థికలను మంత్రి మీనాక్షి లేఖి నేషనల్ మ్యూజియానికి అందచేశారు.


 Also Read: IVF ట్రీట్‌మెంట్‌ వయోపరిమితిపై కేంద్రం వార్నింగ్, పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు