Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లోని హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమపై జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేశారు. షేక్ హసీనా రాజీనామా చేసి వెళ్లిపోయిప్పటి నుంచి ఆందోళనకారులు హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. పలు చోట్ల ఆలయాలు ధ్వంసం చేశారు. హిందువు ఇళ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. అప్పటి నుంచి తీవ్ర అసహనంతో ఉన్న హిందువులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. బంగ్లాదేశ్ రాజధాని ధాకాతో పాటు చిట్టగాంగ్‌లో లక్షలాది మంది హిందువులు ర్యాలీ చేశారు. పలు జిల్లాల్లో వీళ్లపై దాడులు జరుగుతున్నాయి. వేలాది మంది హిందువులు ఈ దాడులు తట్టుకోలేక భారత్‌కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందువులపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అంతే కాదు. పార్లమెంట్‌లో మైనార్టీలకు 10% సీట్లు కేటాయించాలనీ డిమాండ్ చేస్తున్నారు.
మైనార్టీల హక్కులకు రక్షణ కల్పించేలా కొత్త చట్టాలు తీసుకురావాలనీ నినదించారు. హిందువులకు మద్దతుగా వేలాది మంది ముస్లింలూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పలు చోట్ల రోడ్‌లు బ్లాక్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 7 లక్షల మంది ఈ ర్యాలీ చేశారు. అటు అమెరికా, బ్రిటన్‌లోనూ ఇదే స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. (Also Read: Viral News: లేడీస్ వాష్‌రూమ్‌లోని డస్ట్‌బిన్‌లో మొబైల్, వీడియో రికార్డ్ అవుతుండగా చూసి షాకైన మహిళ)
ఈ ర్యాలీలపై ఆపద్ధర్మ ప్రధాని మహమ్మద్ యూనస్ స్పందించారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. హిందువులు, ముస్లింలు, బౌద్ధులపై దాడులు జరగకుండా చూసుకోవాలని, వాళ్ల కుటుంబాల్ని రక్షించాలని కోరారు. వాళ్లూ ఈ దేశ పౌరులే అన్న విషయం మరిచిపోవద్దని అన్నారు.
"వాళ్లు మాత్రం బంగ్లాదేశ్ పౌరులు కాదా..? ఇంత పోరాటం చేసి దేశాన్ని రక్షించుకున్నారు. వాళ్ల కుటుంబాల్నీ కాపాడలేరా..? ఎవరూ వారిపై దాడులు చేయడానికి వీల్లేదు. ఇదే విషయం మీరు అందరికీ చెప్పండి. వాళ్లంతా మన కుటుంబ సభ్యులే. వాళ్లూ మనకోసం పోరాటం చేశారు. అంతా కలిసి కట్టుగా ఉండాల్సిన సమయం ఇది"
- మహమ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రధాని
బంగ్లాదేశ్‌లో ఇంకా అల్లర్లు సద్దుమణగడం లేదు. దాదాపు నెల రోజులుగా అక్కడ ఘర్షణలు కొనసాగుతున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. షేక్ హసీనా ఇంటినీ ముట్టడించారు. వెంటనే ఆమె అక్కడి నుంచి ఇండియాకి వచ్చారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఈ అల్లర్లను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్ సంక్షోభం వెనక అమెరికా హస్తం, షేక్ హసీనా స్పీచ్‌లో సంచలన విషయాలు