Himachal Political Crisis: ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉంది మూడు రాష్ట్రాలు మాత్రమే. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ. కర్ణాటకలో ఇప్పటికే ఏదో ఓ రాజకీయ అలజడి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ (Himachal Pradesh Political Crisis) ఇది మొదలైంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్‌లో టెన్షన్ మొదలైంది. ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. 68 మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్‌లో 40 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో ఈ 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకే మద్దతునిస్తారని అంతా ఊహించారు. కానీ ఉన్నట్టుండి ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం వల్ల హర్ష్ మహాజన్ గెలుపొందారు. ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతునిచ్చారు. ఈ ఓటింగ్ అయిపోయిన వెంటనే వాళ్లంతా హరియాణాకి వెళ్లిపోయారు. ప్రస్తుతం హరియాణాలో బీజేపీయే అధికారంలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వీర్‌భద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య సింగ్ ఇప్పటికే మంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీ క్రమంగా పతనమవుతోందని మండి పడ్డారు. కాంగ్రెస్ ప్రజల నమ్మకం కోల్పోతోందని విమర్శించారు. ఈ క్రమంలోనే నంబర్ గేమ్‌ మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏ పార్టీకి ఎంత మంది మద్దతునిస్తున్నారన్న చర్చ మొదలైంది. 


హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 35 సీట్లలో విజయం సాధిస్తే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. 2022లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 40 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 25 సీట్లకు పరిమితమైంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్‌ బలం మొత్తం 43కి చేరుకుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల్ని పరిశీలిస్తే...ఒకవేళ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతుని ఉపసంహరించుకుంటే కాంగ్రెస్‌ బలం 34కి పడిపోతుంది. అంటే...మ్యాజిక్ ఫిగర్‌ కోల్పోతుంది. అంటే ప్రభుత్వం కూలిపోతుంది. అయితే...అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు సరిగ్గా జరగవని, ఈలోగానే ప్రభుత్వం కూలిపోతుందని కొంతమంది వాదించారు. కానీ...బడ్జెట్‌ని ప్రవేశపెట్టడమే కాకుండా దానికి ఆమోదం కూడా తెలిపింది సుఖ్వీందర్ సింగ్ సర్కార్. అంతే కాదు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న బీజేపీ కుట్ర పని చేయలేదని సుఖ్వీందర్ తేల్చి చెప్పారు. అంతే కాదు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన ఎమ్మెల్యేలు తమకు క్షమాపణలు చెప్పారని వెల్లడించారు. ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు.