HP Election 2022 Voting:


75%పైగా పోలింగ్..!


హిమాచల్‌ ప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. కొండ ప్రాంతమైనప్పటికీ...ఓటింగ్‌కు సవాళ్లు ఎదురైనప్పటికీ..మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే..ఇక్కడ ఎప్పుడూ పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ సారి కూడా రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. పోలింగ్ ముగిసే సమయం నాటికి మొత్తం 75% మేర పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వివరించారు. 68 నియోజక వర్గాలున్న హిమాచల్‌లో పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే...బ్యాలెట్ పేపర్ ఓట్‌లనూ లెక్కిస్తే..ఈ సారి పోలింగ్ శాతం 77% వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో డూన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 85.2% పోలింగ్ నమోదైంది. సిమ్లా పట్టణ నియోజకవర్గంలో అతి తక్కువగా 62.53% గా తేలింది. సిర్మౌర్ జిల్లాలో 78% పోలింగ్ నమోదు కాగా...కంగ్రా జిల్లాలో 71%గా వెల్లడైంది. 2017లోనూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 75.57% ఓటింగ్ నమోదైంది. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనూ ఓటర్లు ఇబ్బంది అనుకోకుండా ఓటు వేసేందుకు ముందుకొచ్చారు. ఎన్నో సవాళ్లు దాటుకుని ఓటు వేసి ఇళ్లకు వెళ్లారు. మంచు కురుస్తున్నా లెక్క చేయలేదు. ఉదయం మంచు తీవ్రంగా ఉండటం వల్ల పోలింగ్ నెమ్మదిగా సాగినా...సూర్యోదయం అయ్యాక ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. గత రికార్డులన్నీ బ్రేక్ చేసి ఈ సారి అత్యధిక స్థాయిలో పోలింగ్ నమోదైందని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. 


డిసెంబర్ 8న ఫలితాలు..


హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. హిమాచల్‌లో భాజపా అధికారంలో ఉంది. ఈ సారి కూడా కచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది కాషాయ పార్టీ. 88 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో 2017లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు భాజపా అధికారంలోకి రాగా...జైరామ్ ఠాకూర్ సీఎం అయ్యారు. 


శ్యాంశరణ్‌కు గూగుల్ నివాళి..


హిమాచల్‌లో ఎన్నికల సందర్భంగా గూగుల్‌ స్వతంత్ర భారత తొలి ఓటర్ శ్యాంశరణ్ నేగికి నివాళి అర్పించింది. డూడుల్‌ వీడియో రూపంలో ట్రిబ్యూట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లోనూ శ్యాంశరణ్ నేగి ఓటు వేశారు. నవంబర్ 2వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియో గించుకున్న నేగి.. నవంబర్ 5న తేదీన కన్నుమూశారు. బతికున్నంత కాలం ఏ ఎన్నిక జరిగినా తప్పకుండా ఓటు వేశారు నేగి. ఇటీవలే 34వ సారి ఓటు వేసి రికార్డు సృష్టించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయనను గుర్తు చేసుకుంటూ గూగుల్ 2 నిముషాల వీడియో రూపొందించింది. "స్వతంత్ర భారత తొలి ఓటర్ శ్యాం శరణ్ నేగిని స్మరించుకుందాం. ఓ పౌరుడిగా మన బాధ్యతలు నిర్వర్తించాలని బలంగా అనుకుంటే మన దారిలో ఎలాంటి అడ్డంకులు రావన్న పాఠం నేర్పారు" అని ట్వీట్ చేసింది గూగుల్.