Suryapet Accident: సూర్యాపేట జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే జిల్లాలోని మునగాల మండల కేంద్రం శివారులోని పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సమీపంలోని సాగర్ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం రాత్రి మహాపడి పూజకు హాజరయ్యారు. వీరిలో దాదాపు 38 మంగి ట్రాక్టర్ ట్రాలీలో ఇంటికి వెళ్లేందుకు పయనం అయ్యారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో వెళ్తుండగా... విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 


అయితే ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. అయితే హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు సరిపోలేదు. దీంతో కొంతమంది స్థానికులు తమ వాహనాలపైనే క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడికక్కడే చనిపోయిన తన్నీరు ప్రమీల(35), చింతకాయల ప్రమీల(33), ఉదయ్ లోకేష్(8), నారగాని కోటయ్య(55) మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. గండు జ్యోతి (38) చికిత్స పొందతూ మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. 


మైసమ్మ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం - ఇద్దరు మృతి


మహబూబ్ నగర్ జిల్లాలో మైసమ్మ తల్లిని దర్శించుకునేందుకు వెళ్లిన వాళ్లు ఈరోజు ఉదయం ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. హజీలాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ (35) తన వరి ధాన్యాన్ని ట్రాక్టర్‌లో రైస్ మిల్లుకు తీసుకెళ్తున్నాడు. అలాగే దేవరకద్ర మండలం పర్దిపూర్ తండాకు చెందిన ఓ కుటుంబం నాగర్ కర్నూల్ జిల్లాలోని నాయినోన్ పల్లి మైసమ్మ దర్శనం కోసం బయలుదేరారు. ఈ క్రమంలోనే ముందు వెళ్తున్న లారీని వెనక నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ట్రాక్టర్‌లో ఉన్న లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే కారులో ఉన్న మరో మహిళ కూడా మృతి చెందింది. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. 


రోడ్డు ప్రమాదం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అంబులెన్సుకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే చనిపోయిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడా అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వేగంగా వచ్చిన కారు ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది