నిజాం కాలేజీ హాస్టల్‌ సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నవంబరు 17 వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. 50 శాతం చొప్పున యూజీ, పీజీ విద్యార్థినులకు సీట్లను కేటాయిస్తామని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. నవంబరు 17 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నవంబరు 19న తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. సీట్లు కోరే విద్యార్థులు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చు. ఇదిలా ఉంటే హాస్టల్‌లోని సీట్లను తమకే కావాలని గత కొన్ని రోజులుగా నిజాం కాలేజీల విద్యార్థినులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. 


మరోవైపు  హైదరాబాద్ నిజాం కళాశాలలో హాస్టల్ సౌకర్యం కోసం యూజీ విద్యార్థులు చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ నిజాం కాలేజీకి వచ్చినప్పుడు తమ సమస్యను గుర్తించి రూ.5 కోట్లు కేటాయించారని.. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం 50 శాతం మాత్రమే సీట్లను యూజీ విద్యార్థులకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. తమకు హాస్టల్​లో  100 శాతం గదులు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం యూజీ, 50 శాతం పీజీ విద్యార్థులకు హాస్టల్ సీట్లు కేటాయిస్తూ.. విద్యాశాఖ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రంజిని, వార్డెన్​లు.. ఆందోళన చేస్తున్న విద్యార్థుల దగ్గరకు వచ్చి అర్హత కలిగిన విద్యార్థులు వసతి గృహంలో ప్రవేశానికి రావాలని సూచించారు.


వసతి గృహంలో గదులు కావాల్సిన వారు నవంబరు 17లోపు దరఖాస్తు పెట్టుకోవాలని.. 19లోపు అర్హత ఉన్న విద్యార్థుల లిస్ట్ ప్రకటిస్తామని వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. 2017లో మంత్రి కేటీఆర్ నిజాం కాలేజీకి వచ్చినప్పుడు బాలికల వసతి గృహం కోసం వినతిపత్రం ఇచ్చామని విద్యార్థులు తెలిపారు. తమ సమస్యను చూసి కేటీఆర్ రూ.5 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. తమ వల్లనే నూతన వసతి గృహం నిర్మాణం అయ్యిందన్నారు. తమకు హాస్టల్​లో 100 శాతం గదులు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని యూజీ విద్యార్థులు స్పష్టం చేశారు. గత ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నామని.. తమ న్యాయమైన డిమాండ్​పై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.


నిజాం కాలేజీకి అనుబంధంగా నూత‌నంగా నిర్మించిన హాస్టల్‌ను పీజీ విద్యార్థుల‌కు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. ఈ హాస్టల్‌ను త‌మ‌కే కేటాయించాల‌ని యూజీ విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. స‌మ‌స్యను ప‌రిష్కరించాల‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఓయూ వీసీ ర‌వీంద‌ర్ యాద‌వ్, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడి స‌మ‌స్యను ప‌రిష్కరించారు. ఈ మేర‌కు కాలేజీ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న‌ర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నూత‌నంగా నిర్మించిన హాస్టల్ భ‌వ‌నంలో 50 శాతం సీట్లను యూజీ విద్యార్థినుల‌కు, మ‌రో 50 శాతం సీట్లను పీజీ విద్యార్థినుల‌కు కేటాయించాల‌ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల‌ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని నిజాం కాలేజీ ప్రిన్సిప‌ల్‌ను ఆదేశించారు.