T20 WC 2022:  టీమిండియా భవిష్యత్తులో నైనా ప్రపంచకప్ కొట్టాలంటే జట్టులో భారీ మార్పులు జరగాల్సిందేనని.. భారత మాజీ డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఈ టీ20 ప్రపంచకప్ లో దారుణంగా విఫలమైన కొందరి ముఖాలను వచ్చే మెగా టోర్నీలో చూడాలని లేదని చెప్పాడు.


టీ20 ప్రపంచకప్ నుంచి భారత జట్టు అవమానకర రీతిలో నిష్క్రమించిన తర్వాత సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో టీమిండియా ప్రపంచకప్ లు సాధించాలంటే జట్టులో ప్రక్షాళన జరగాలి. ఈసారి విఫలమైన ఆటగాళ్లు వచ్చే వరల్డ్ కప్ లో ఉండకూడదు. కుర్రాళ్లకు అవకాశమిచ్చి జట్టులో మార్పులు చేయాలి. మొదటి టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న 2007 లోనూ ఇదే పరిస్థితి ఉంది. అప్పుడు దిగ్గజ ఆటగాళ్లు జట్టులో లేరు. అందరూ కుర్రాళ్లే ఉన్నారు. వారే కప్ ను సాధించారు. ప్రస్తుత భారత జట్టును కుర్రాళ్లతో నింపాలి. వచ్చే పొట్టి కప్పుకు జట్టును బలంగా తయారు చేసుకోవాలి. అని సెహ్వాగ్ అన్నాడు.


డిసెంబరులో కొత్త సెలక్షన్ కమిటీ బాధ్యతలు తీసుకోబోతుంది. దీనిపైనా సెహ్వాగ్ స్పందించాడు. వారికి జట్టు ఎంపిక సవాల్ లాంటిదేనని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్ గురించి ఆలోచించి ఇప్పుడే  సరైన నిర్ణయాలు తీసుకంటే వచ్చే రెండేళ్లలో బలమైన జట్టును తయారుచేసుకోవచ్చని సూచించాడు. అయితే కొత్త సెలక్షన్ కమిటీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలదా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉందన్నాడు. 


స్వదేశానికి భారత జట్టు


టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత జట్టు స్వదేశానికి చేరుకుంది. కోచ్ ద్రవిడ్, షమీ, దినేశ్ కార్తీక్, ఇంకా జట్టు సహాయ సిబ్బంది తదితరులు భారత్ కు వచ్చారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వేరే విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. ఈనెల 18 న ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైన వారు మెల్ బోర్న్ నుంచి సరాసరి ఆక్లాండ్ కు బయలుదేరారు. ముంబయి విమానాశ్రయంలో అభిమానులు కోహ్లీతో ఫొటోలు దిగారు. 


కోచ్ ద్రవిడ్ కు విరామం


టీమ్‌ఇండియా కోచింగ్ బాధ్యతలకు రాహుల్‌ ద్రవిడ్‌ కొన్నాళ్లు విరామం ఇవ్వనున్నాడు. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లడం లేదని తెలిసింది. కొన్ని రోజులు కుటుంబంతో గడిపి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడు. దాంతో న్యూజిలాండ్ పర్యటనలో భారత్‌కు ఎన్‌సీఏ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ కోచ్‌గా ఉంటాడు. నవంబర్‌ 18 నుంచి 30 వరకు కివీస్ తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ సిరీసుల్లో సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ కు విశ్రాంతి ఇచ్చారు.