Himachal CM Sukhvinder Singh Sukhu:
సుఖ్వీందర్ సింగ్‌కు కరోనా
హిమాచల్ ప్రదేశ్ ముఖ్మమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకు కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో ఉన్న ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆదివారం సాయంత్రం రిపోర్ట్ వచ్చింది. అందులో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్న సుఖ్వీందర్...షిమ్లాకు రావాల్సి ఉంది. కానీ...కరోనా సోకడం వల్ల ఢిల్లీలోనే క్వారంటైన్ అయ్యారు. హిమాచల్ సదన్‌లో మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. నిజానికి...
అధిష్ఠానంతో సంప్రదింపులు జరిపి త్వరలోనే కేబినెట్ విస్తరణ చేపట్టాలని భావించారు సుఖ్వీందర్. అయితే...ఆయన ఇప్పుడు కరోనా బారిన పడటం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆయన కలవాల్సి ఉంది. అందుకే...ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌గా తేలడం వల్ల ప్రధానిని ప్రస్తుతానికి ఆయన ప్రధానిని కలిసే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
ఈ నెల 16న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, షెడ్యూల్‌లోని ప్రోగ్రామ్స్ అన్నీ రద్దు చేశామని అధికారులు వెల్లడించారు.
హామీలు నెరవేర్చుతాం: సుఖ్వీందర్
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చి తీరుతామని హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు ఇటీవలే వెల్లడించారు. కాంగ్రెస్ మొత్తం 10 హామీలు ఇచ్చిందని...వాటిలో అత్యంత కీలకమైన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS)ను తప్పక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. "మొత్తం 10 హామీలిచ్చాం. అవన్నీ అమలు చేసి తీరతాం. పారదర్శకత, నిజాయతీతో కూడిన పరిపాలన అందిస్తాం. మొట్టమొదటి కేబినెట్
మీటింగ్‌లోనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుపై నిర్ణయం తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. ఇవి కాకుండా కాంగ్రెస్ మరి కొన్ని కీలక హామీలు ఇచ్చింది. ప్రతి ఇంటికీ 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పింది. 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.1,500 నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది. మొబైల్ క్లినిక్స్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించింది.
ప్రియాంక మాస్టర్ ప్లాన్...
పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన కాంగ్రెస్‌కు కాస్త ఉత్సాహాన్నిచ్చాయి...హిమాచల్ ఎన్నికల ఫలితాలు. ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ సహా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఎన్నికలు జరిగిన ప్రతి చోటా ఉనికి కోల్పోతూ వస్తున్న పార్టీకి కొత్త బలమొచ్చింది. హిమాచల్‌లో కాంగ్రెస్ గెలవటానికి కారణాలేంటని అనలైజ్ చేస్తే...ముందుగా ప్రియాంక గాంధీ పేరే వినిపిస్తోంది. సుఖ్వీందర్ సింగ్‌ను సీఎం చేయాలన్న ఆలోచన కూడా ప్రియాంక గాంధీదే అని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో చాలా యాక్టివ్‌గా ప్రచారం చేశారు ప్రియాంక గాంధీ. ఫలితాలు వచ్చిన వెంటనే అంతే యాక్టివ్‌గా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన వ్యూహాలను రెడీ చేసుకున్నారు. అందరి ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటూ...అందరి అభిప్రాయాలనూ గౌరవిస్తూనే సుఖ్వీందర్‌ను సీఎం చేశారామె.
Also Read: Telangana Congress: కాంగ్రెస్‌లో కారుచిచ్చు! ముందరి కాళ్లకు బంధం వేస్తున్నదెవరు? వేయించేదెవరు?