Himachal Elections:


4.4% పోలింగ్..


హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకూ 4.4% పోలింగ్ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. "ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాలు పంచుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావాలని ఆశిస్తున్నాను. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతకు నా అభినందనలు" అని ట్వీట్ చేశారు. ఇక హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. "చాలా ఉత్కంఠగా ఉంది. సంతోషంగానూ ఉంది. మండీ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ నాకు మద్దతుగా ఉన్నారు. మా పాలనలో జరిగిన అభివృద్ధి ఏంటో ప్రజలు గమనించాలి. వాళ్లు తప్పకుండా బీజేపీకే ఓటు వేస్తారన్న నమ్మకముంది" అని వెల్లడించారు. ఓటు వేసే ముందు ఠాకూర్ తన కుటుంబంతో కలిసి మండీలోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఓటు హక్కు ఉన్న వాళ్లందరూ తప్పకుండా ఓటు వేయాలని సూచించారు. ఇప్పటి వరకూ తమకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్‌ కూడా సిమ్లాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.


















"హిమాచల్ ప్రదేశ్ ఓటర్లందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు. కాంగ్రెస్‌కు 40-45 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అమిత్‌ షా కూడా హిమాచల్ ప్రదేశ్ ఓటర్లను ఉద్దేశించి ట్వీట్ చేశారు. "అవినీతి రహిత ప్రభుత్వం మాత్రమే హిమాచల్ ప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చుతుంది. పెద్దలతో పాటు యువత కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేలా చూడాలని కోరుతున్నాను" అని ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఓటు హక్కు వినియోగించుకున్నాక తరవాత కీలక వ్యాఖ్యలు చేశారు. "హిమాచల్ ప్రదేశ్‌లోనే కాదు. గుజరాత్‌లోనూ మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుంది" అని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ భరద్వాజ్ సిమ్లాలో ఓటు వేశారు. 










డిసెంబర్ 8న ఫలితాలు..


హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. హిమాచల్‌లో భాజపా అధికారంలో ఉంది. ఈ సారి కూడా కచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది కాషాయ పార్టీ. 88 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో 2017లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు భాజపా అధికారంలోకి రాగా...జైరామ్ ఠాకూర్ సీఎం అయ్యారు. 


Also Read: Why Modi Meet Pawan : మోదీతో పవన్ భేటీలో రాజకీయం ఏమిటి ? బీజేపీతో కలిసే ఉండమని చెప్పారా? జనసేనాని అడిగిన రోడ్ మ్యాప్ ఇచ్చారా ?