Kolkata Doctor Case: కోల్‌కత్తాలోని ఆర్‌జీ కార్ హాస్పిటల్‌పై నిరసనకారులు దాడి చేశారు. ఈ ఘటనలో అద్దాలు, కిటికీలతో పాటు పలు వైద్య పరికరాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే కోల్‌కత్తా హైకోర్టు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని స్పష్టం చేసింది. దీదీ ప్రభుత్వాన్ని మందలించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని తేల్చి చెప్పింది. ఈ దాడి జరిగిన తరవాత కోర్టుకి పెద్ద ఎత్తున మెయిల్స్ వచ్చాయి. వెంటనే స్పందించిన న్యాయస్థానంలో విచారించాల్సిన పిటిషన్‌ల జాబితాలో దీన్ని చేర్చింది. 


"ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. పోలీసులు ఉండి కూడా ఈ దాడిని అడ్డుకోలేకపోయారు. అక్కడి డాక్టర్లు ఎలాంటి భయం లేకుండా ఎలా పని చేయగలుగుతారు..? ఈ ఘటనపై మాకు చాలా మెయిల్స్ వచ్చాయి. అందుకే అత్యవసరంగా విచారిస్తున్నాం"


- కోల్‌కత్తా హైకోర్టు 






అయితే...కోర్టు వ్యాఖ్యలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. దాదాపు 7 వేల మంది ఒకేసారి వచ్చారని, ఉన్నట్టుండి నిరసనకారుల సంఖ్య పెరగడం వల్ల పోలీసులు ఏమీ చేయలేకపోయారని వివరించింది. అంతే కాదు. ఇందుకు సంబందించిన వీడియోలు కూడా ఉన్నాయని కోర్టుకి వెల్లడించింది. తప్పనిసరి పరిస్థితుల్లో టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని చెప్పింది. 15 మంది పోలీసులు గాయపడ్డారని తెలిపింది. ఈ వివరణపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. హాస్పిటల్ యాజమాన్యంపైనా మండి పడింది. పోలీసులకు ఇంటిలిజెన్స్ విభాగం ఉంటుందని, అన్ని వేల మంది వస్తారని ముందే ఊహించలేకపోయారా అని ప్రశ్నించింది. ఈ నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని ప్రభుత్వం బదులిచ్చింది. ఇప్పటి వరకూ ఈ ఘటనపై ఏం చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది హైకోర్టు. .


ఇప్పటికే ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆరా తీస్తోంది. ఈ మేరకు హాస్పిటల్‌లోని డాక్టర్‌లను ప్రశ్నిస్తోంది. అయితే..హైకోర్టు మాత్రం పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. అన్ని వేల మంది నడుచుకుంటూ వచ్చి ఇదంతా చేశారంటారా..? అని ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టాల్సిందని అభిప్రాయపడింది. ఇలాంటి ఘటనలు వైద్యుల భద్రతనే ప్రశ్నిస్తాయని, వాళ్లలో ఆందోళన పెంచుతాయని వ్యాఖ్యానించింది. ఎక్కడైనా వైద్యులు ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వర్తించే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది. 


Also Read: Uttarakhand: కోల్‌కత్తా ఘటన మరవకముందే మరో దారుణం, నర్స్‌పై అత్యాచారం - రాడ్‌తో కొట్టి ఉరి బిగించి హత్య