Hemant Soren return as Jharkhand CM: ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి హేమంత్ సోరెన్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. ఇండీ కూటమిలోని ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హేమంత్ సోరెన్ భూకుంభకోణంలో అరెస్టై ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ సీఎం బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయన త్వరలోనే ఆ పదవిని మళ్లీ చేపట్టనున్నారు. ఝార్ఖండ్ ముక్తి మోర్ఛ, కాంగ్రెస్‌, RJD పార్టీలను ఆయనను లీడర్‌గా ఎన్నుకున్నాయి. ఫలితంగా ఆయన మరోసారి సీఎం బాధ్యతలు తీసుకునేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ ఏడాది జనవరిలో భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు హేమంత్ సోరెన్. ఆ సమయలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరవాత చంపై సోరెన్ సీఎం బాధ్యతలు తీసుకున్నారు. ఝార్ఖండ్‌ హైకోర్టు ఇటీవలే భూకుంభకోణం కేసు విచారణ చేపట్టింది. ఆయన తప్పు చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. ఈ మేరకు బెయిల్‌ మంజూరు చేసింది. 






ఇదంతా బాగానే ఉన్నా చంపై సోరెన్ మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనను తప్పించి మళ్లీ హేమంత్ సోరెన్‌కి బాధ్యతలు ఇవ్వడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. అయితే..చంపై సోరెన్‌కి JMM ఎగ్జిగ్యూటివ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టే అవకాశాలున్నాయి. కానీ అందుకు చంపై సోరెన్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. సీఎం పదవి నుంచి తప్పించడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే ఝార్ఖండ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో హేమంత్ సోరెన్ JMM తరపున ప్రచారం చేస్తే కలిసొస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో ఆయన బెయిల్‌పై బయటకు రావడం పార్టీకి కొత్త జోష్ ఇచ్చింది. అయితే...గిరిజన వర్గానికి చెందిన చంపై సోరెన్‌ని సీఎం పదవి నుంచి తప్పించడంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అసహనం వ్యక్తం చేశారు. ఝార్ఖండ్ ప్రజలు కచ్చితంగా ఈ నిర్ణయాన్ని తిప్పికొడతారని వెల్లడించారు. త్వరలోనే ఈ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని తేల్చి చెప్పారు. 






Also Read: Hathras Stampede: హత్రాస్ ఘటన విచారణకు సిట్‌ నియామకం, జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించిన యోగి సర్కార్