Hathras Stampede Death: హత్రాస్ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. విచారణ జరిపేందుకు సిట్‌ని నియమించినట్టు వెల్లడించారు. ఇప్పటికే అధికారులు ప్రాథమిక రిపోర్ట్‌ని సబ్మిట్ చేసినట్టు తెలిపారు. రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ నేతృత్వంలో జ్యుడీషియల్ ఎంక్వైరీ చేపడతామని హామీ ఇచ్చారు. ఈ విషాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. Bhartiya Nyay Sanhita ప్రకారం నిర్వాహకులపై ఇప్పటికే FIR నమోదైంది. అందులో భోలే బాబా సన్నిహితుడితో పాటు మరి కొంతమంది అనుచరుల పేర్లున్నాయి. ప్రభుత్వం నియమించిన ఈ విచారణ కమిటీలో కొందరు అధికారులతో పాటు పోలీసులూ సభ్యులుగా ఉంటారని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
"ఈ ఘటనపై సిట్ నియమించాం. ఇప్పటికే ప్రాథమిక రిపోర్ట్ అందింది. పూర్తి స్థాయిలో దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చాను. పలు కోణాల్లో ఈ కేసుని విచారించాల్సిన అవసరముంది. అందుకే జ్యుడీషియల్ విచారణకూ ఆదేశించాం. రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. మాజీ సీనియర్ అధికారులతో పాటు పోలీసులూ ఈ విచారణ చేపడతారు"
- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి
ఘటనా స్థలాన్నీ పరిశీలించారు యోగి ఆదిత్యనాథ్. ప్రమాదానికి కారణాలేంటో ఆరా తీశారు. ముగ్గురు మంత్రులు పూర్తిగా ఈ బాధ్యతలే తీసుకున్నారని వెల్లడించారు యోగి. సీనియర్ అధికారులతో పాటు పోలీస్ ఉన్నతాధికారులూ ఎప్పటికప్పుడు పరిస్థితులు ఆరా తీస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపైనా తీవ్రంగా మండి పడ్డారు యోగి ఆదిత్యనాథ్. ఇలాంటి విషాదకరమైన ఘటనల్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఇంత విషాదం జరిగితే కొందరు రాజకీయం చేస్తున్నారు. వీళ్ల వైఖరే ఇంత. అయినా భోలే బాబాతో ఎవరు సన్నిహితంగా ఉన్నారో, ఎవరు ఫొటోలు దిగారో అందరికీ తెలుసు. ఆయనకు ఏ రాజకీయ నాయకులతో సంబంధం ఉందో కూడా తెలుసు. చాలా రోజులుగా ఇక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి. ఎప్పుడూ తొక్కిసలాట జరగలేదు. కానీ ఈ సారి మాత్రమే ఎందుకు జరిగింది. ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. అమాయకుల ప్రాణాలతో ఆటలాడే వాళ్లను ఉపేక్షించం"
- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించినట్టు యోగి వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడ్డ చిన్నారులకు ముఖ్యమంత్రి బాల సేవ యోజన కింద ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారం, గాయపడ్డ వారికి రూ.లక్ష పరిహారం అందిస్తామని అన్నారు.