Arvind Kejriwal Seeks Bail: అరవింద్ కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ (delhi liquor scam) అయిన ఆయన తిహార్‌ జైల్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయనను CBI విచారిస్తోంది. ఈ పిటిషన్‌లో ఆయన CBI సంచలన ఆరోపణలు చేశారు. విచారణ పేరుతో అధికారులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇది కచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని స్పష్టం చేశారు. అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నానని వెల్లడించారు. అటు సీబీఐ మాత్రం కేజ్రీవాల్ విచారణకు సహకరిండం లేదని అసహనం వ్యక్తం చేస్తోంది. తన అరెస్ట్ అక్రమమని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు కేజ్రీవాల్. పదేపదే రిమాండ్‌ తెచ్చుకుంటున్నారని, ఇది చట్టపరంగా సరికాదని వాదించారు. 


"ఇప్పటికే ఈ కేసుకి సంబంధించిన విచారణలు పూర్తయ్యాయి. అరెస్ట్‌ తరవాత తెలుసుకోవాల్సిన సమాచారం అంతా తెలుసుకున్నారు. కానీ సీబీఐ చట్టంతో ఆడుకుంటోంది. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తోంది. కేసు ఆబ్జెక్టివ్ ఏంటో దాని మేరకు నడుచుకోవాలి. పక్షపాతంగా వ్యవహరించడం ఏం మాత్రం సరికాదు"


- అరవింద్ కేజ్రీవాల్ 




ప్రస్తుతం కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్‌ తెచ్చుకోవడం కోసం చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ సీబీఐ సవాల్ చేయడం వల్ల ఈ వ్యవహారం హైకోర్టుకి చేరుకుంది. ఆ తరవాత కోర్టు బెయిల్ పై స్టే ఇచ్చింది. ఫలితంగా కేజ్రీవాల్ జైల్‌కే పరిమితమయ్యారు. అయితే..ఇప్పుడు మరోసారి రెగ్యులర్ బెయిల్‌ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ పిటిషన్‌పై స్పందించాలని ఇప్పటికే కోర్టు CBIని అడిగింది. జులై 17న ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశముంది.