Actor Vijay on NEET Row: నీట్ ఎగ్జామ్‌పై తమిళ నడుటు, తమిళగ వెట్రి కరగం చీఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ ఎగ్జామ్‌పై విశ్వాసం కోల్పోయారని తేల్చి చెప్పారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. వెనకబడిన వర్గాలకు ఈ పరీక్ష కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని వెల్లడించారు. స్టేట్ సిలబస్ చదువుకున్న వాళ్లకి NCERT సిలబస్‌లో ఎగ్జామ్ పెట్టడమేంటని ప్రశ్నించారు. తమిళనాడు ప్రజల అభిప్రాయాలను గౌరవించి వెంటనే ఈ పరీక్షని రద్దు చేయాలని కేంద్రానికి సూచించారు.
"నీట్ ఎగ్జామ్‌పై విద్యార్థులు విశ్వాసం కోల్పోయారు. ఈ దేశానికి ఈ పరీక్ష అవసరమే లేదు. దీని నుంచి మినహాయింపు ఇవ్వడం తప్ప మరో పరిష్కారం లేదు. రాష్ట్ర అసెంబ్లీలో నీట్‌ని వ్యతిరేకిస్తూ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి నేను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. తమిళనాడు ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే దీన్ని రద్దు చేయాలి"
- విజయ్, నటుడు, రాజకీయ నాయకుడు
మొదటి నుంచి నీట్ ఎగ్జామ్‌ని వ్యతిరేకిస్తూనే ఉంది తమిళనాడు ప్రభుత్వం. ఇది కేవలం ధనవంతుల కోసమే పెడుతున్న ఎగ్జామ్ అని మండి పడుతోంది. ఇప్పుడు పేపర్ లీక్ వ్యవహారంతో మరింత దూకుడు పెంచింది. అసలు నీట్ ఎగ్జామ్‌ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. గతంలోలా 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే అడ్మిషన్‌లు ఇవ్వాలని తేల్చిచెబుతోంది. ఈ మేరకు ఇటీవలే అసెంబ్లీలో ఓ తీర్మానాన్నీ ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ తీర్మానాన్ని తీసుకురాగా దానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా నీట్‌ని వ్యతిరేకిస్తున్నారు. వెంటనే రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ వివాదం దుమారం రేపుతూనే ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఈ వివాదంపై సభలో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇంత సున్నితమైన అంశాన్ని ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని మండి పడ్డారు. యువత భవిష్యత్‌తో ఆడుకునే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్‌లో ఈ వివాదంపై చర్చించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది అభ్యర్థుల ప్రశ్నలకు మోదీ సమాధానం చేప్పాలని అన్నారు. ట్విటర్‌లో ఆయన ఈ మేరకు లెటర్‌ని పోస్ట్ చేశారు.