Rajya Sabha member K Keshava Rao  join Congress :  బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఆమోదించారు. ఆ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో తెలంగాణలో ఓ రాజ్య సభ స్థానం ఖాళీ అయినట్లయింది. 


 మూడూ రోజుల కిందట సీఎం రేవంత్  రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన కేకే .. మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. ఆ తర్వాత రోజు రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు.  పార్టీ మారితే అనర్హతా వేటు పడుతుంది కనుక  రాజీనామా చేశారు.   2020లో బీఆర్ఎస్ నుంచి కేకే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇంకా రెండేళ్లకుపైగా పదవి కాలం ఉంది. అయితే రాజీనామా చేయడం వల్ల వచ్చే ఉపఎన్నిక ద్వారా ఆయన మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆ షరతు మీదనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని చెబుతున్తునారు.   కేకే కుమార్తె , హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. కేకే కుమారుడు విప్లవ్ బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారు. 


కేకే స్వతహాగా కాంగ్రెస్ నేత. ఆయన పలుమార్లు పీసీసీ చీఫ్ గా పని చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్క సారే గెలిచారు. తర్వాత ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఆయనకు పదవులు మాత్రం వస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత ... తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోవడం.. కాంగ్రెస్ బలహీనపడటంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు  మంచి పదవి ఇచ్చి..  కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం పోగానే ఆయన  కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.   కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎమ్మెల్యేల బలం కూడా ఉన్నందున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే ఉపఎన్నికల్లో మరోసారి పదవి పొందవచ్చన్న నమ్మకంతో రాజీనామా చేశారు.                             


బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ద్వితీయ శ్రేణి నేతలు కూడా చేరుతున్నారు. అయితే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లీడర్లు పోయినా అలాంటి వాళ్లను వంద మందిని తయారు చేసుకుంటామని.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు 160 అవుతాయని అందరికీ అవకాశం దక్కుతుందని బుజ్జగిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రంమ బలంగా ఆకర్ష్‌ను   ప్రయోగిస్తోంది.