Heavy Rains in Tamilnadu: తమిళనాడును (Tamilnadu) భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మొన్నటివరకూ చెన్నైలో (Chennai) వానలు బీభత్సం సృష్టించగా, ఇప్పుడు దక్షిణ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తున్నాయి. తిరునల్వేలి (Tirunalveli), తూత్తుకుడి, కన్యాకుమారి (Kanyakumari), తెన్ కాసి, విరుద్ నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల రహదారులపై నీళ్లు నిలిచిపోగా, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారీ వానల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే, కొన్ని ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులకు సైతం సెలవు ప్రకటించారు. తూత్తుకుడి జిల్లాలోని కోవిల్ పట్టి, ఎట్టయపురం, విలాతికుళం, కలుగుమలై, కయతార్, కదంబూర్, వెంబర్, సురంగుడి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నిరంతరంగా వర్షాలు పడుతుండగా, సమీపంలోని నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తిరునల్వేలి జిల్లాలోని పాలయంకొట్టయ్ లో 26 సెం.మీ, కన్యాకుమారిలో 17.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. కాగా, కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామాంతపురం, పూడుకొట్టాయి, తంజావూర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.










పలు రైళ్లు రద్దు


భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడులో పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. ట్రాకులపై నీరు నిలిచిపోగా, తిరునల్వేలికి రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన వందేభారత్ సహా మొత్తం 17 రైళ్లను అధికారులు రద్దు చేశారు. అలాగే, తూత్తుకుడి నుంచి రాకపోకలు సాగించే కొన్ని విమానాలను దారి మళ్లించారు. మరికొన్నింటిన రద్దు చేశారు. 






సీఎం సహాయక చర్యలు


భారీ వర్షాలతో పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని దిగువకు విడుదల చేయగా, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని నీట మునిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు నిర్దేశించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర పోలీస్ బలగాలు సహాయక చర్యలు చేపట్టారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల ప్రారంభంలో 'మిగ్ జాం' తుపాను ప్రభావంతో చెన్నై నగరం అతలాకుతలం కాగా, ఇప్పుడు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వచ్చే 2  రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 






Also Read: Sabarimala Temple Crowded: శబరిమలలో చిన్నారులకు ప్రత్యేక క్యూ లైన్‌లు,రద్దీ తగ్గించేందుకు కీలక నిర్ణయం