Sabarimala Temple Crowded:
శబరిమలలో భక్తుల రద్దీ..
శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల రద్దీ (Sabarimala Temple Crowded) అంతకంతకూ పెరుగుతోంది. డిసెంబర్ 17న ఆదివారం కావడం వల్ల ఈ సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే క్యూలైన్‌లలో భక్తులను కట్టడి చేయలేకపోతున్నారు..నిర్వాహకులు. తొక్కిసలాటలు జరుగుతున్నాయి. నవంబర్ 17 నుంచి మొదలైన ఈ రద్దీ ఇప్పటికీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ ముగిసేంత వరకూ ఇదే స్థాయిలో భక్తులు పోటెత్తుతారని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో చాలా మంది అయ్యప్ప దీక్షలో ఉంటారు. వాళ్లందరూ ముడుపులు సమర్పించుకునేందుకు అయ్యప్ప సన్నిధికి తరలి వస్తుంటారు. అయితే...ఈ రద్దీని అంచనా వేసి ముందస్తు ఏర్పాట్లు ఏమీ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గంటల కొద్దీ భక్తులు క్యూలోనే నిలుచోవాల్సి వస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి లేఖ రాశారు. అయ్యప్ప ఆలయం వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. భక్తులు క్యూ లైన్లలో ఎదురు చూసే సమయాన్ని వీలైనంత వరకూ తగ్గించాలని తెలిపారు. వీటితో పాటు భక్తులకు కావాల్సిన ఆహారం, నీళ్లు, మెడికల్ ఫెసిలిటీస్‌నీ అందుబాటులోకి తీసుకురావాలని లేఖలో ప్రస్తావించారు. భక్తులెవరూ అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవాలని సూచించారు. ట్విటర్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
చిన్నారులకు ప్రత్యేక లైన్‌లు..
క్యూ లైన్ల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలోనే ట్రావెన్‌కోర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేసింది. గంటల కొద్దీ చిన్నారులు లైన్‌లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం (డిసెంబర్ 17) ఉదయం నుంచే ఇది అమలు చేస్తోంది. ఈ సిస్టమ్ అమలు చేసిన తరవాత భక్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే...ఈ లైన్‌లో కేవలం చిన్నారులను మాత్రమే అనుమతించేలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. చిన్నారులతో పాటు దివ్యాంగులు, మహిళలకూ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు బోర్డ్ తెలిపింది.